Gottipati Ravi Kumar: కడప రైతు మూడేళ్ల సమస్యకు మూడు గంటల్లోనే పరిష్కారం!

Minister Gottipati Ravi Kumar solves Andhra ryot low power cables problem

  • పొలంలోకి తీగలు వేలాడుతుండడంతో వ్యవసాయానికి ఇబ్బంది
  • మూడేళ్లుగా ఇబ్బందిపడుతున్న నాగసానిపల్లె రైతు గంగయ్య
  • ఫొటోలు వైరల్ కావడంతో స్పందించిన మంత్రి రవికుమార్
  • అధికారులను పంపి సమస్యను పరిష్కరించిన వైనం

కడప జిల్లాకు చెందిన రైతు మూడేళ్లుగా అనుభవిస్తున్న బాధకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ మూడు గంటల్లోనే పరిష్కారం చూపించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ఖాజీపేట మండలం నాగసానిపల్లెకు చెందిన రైతు గంగయ్య పొలంలో విద్యుత్తు తీగలు వేలాడుతూ పొలం పనులకు ఆటంకం కలిగించేవి. దీంతో పనులు చేసుకునే సమయంలో కుటుంబ సభ్యులు కర్రలతో  తీగలను పైకి లేపితే ఆయన పనులు చేసుకునేవారు. ఈ విషయాన్ని మూడేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ప్రమాదమని తెలిసినా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వ్యవసాయం చేసేవాడు. 

తాజాగా మళ్లీ సాగుకు కాలం కావడంతో నిన్న ఉదయం గంగన్న పొలానికి వెళ్లాడు. ఎప్పటిలానే తీగలు పైకెత్తి దుక్కి దున్నతుండగా కొందరు ఈ దృశ్యాలను ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోలు విద్యుత్తుశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. జిల్లా ఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ రమణతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. మంత్రి ఆదేశాలతో ఆయన వెంటనే గంగయ్య పొలానికి సిబ్బందిని పంపి విద్యుత్తు స్తంభం ఏర్పాటు చేసి తీగలను సరిచేశారు. మూడేళ్ల సమస్య మూడు గంటల్లో తీరినందుకు రైతు గంగయ్య ఆనందానికి హద్దే లేకుండా పోయింది.

More Telugu News