Puri Jagannadh: 46 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న పూరీ జగన్నాథుడి భాండాగారం!

Jagannath Ratna Bhandar Likely to Be Opened on July 14

  • ఈ నెల 14న తెరవాలంటూ ప్రభుత్వానికి కమిటీ సిఫార్సు
  • ఏకగ్రీవంగా తీర్మానించిన 16 మంది సభ్యుల కమిటీ
  • తాళంచెవితో తెరుచుకోకుంటే పగలగొట్టనున్నట్లు వెల్లడి
  • ఆభరణాల లెక్కింపుకు పలు మార్గదర్శకాలు

పూరీ జగన్నాథుడి భాండాగారం దాదాపు 46 ఏళ్ల తర్వాత తిరిగి తెరుచుకోనుంది. స్వామికి చెందిన విలువైన ఆభరణాలను లెక్కించేందుకు భాండాగారం తలుపులు తెరవనున్నారు. లోపల ఐదు పెట్టెలలో భద్రపరిచిన ఆభరణాల లెక్కింపు, వాటి విలువ మదింపు సహా భాండాగారం మరమ్మతులు చేయాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఆలయ ఖజానా లెక్కింపుపై ఏర్పాటు చేసిన జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ మంగళవారం భేటీ అయింది. ఈ నెల 14న ఆలయ భాండాగారం తెరిచి, ఆభరణాలను లెక్కించాలని కమిటీలోని 16 మంది సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. దీంతో ప్రభుత్వానికి ఆ తీర్మానం పంపగా.. ఖజానా లెక్కింపునకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కలెక్టరేట్‌ ట్రెజరీలో ఉన్న తాళంచెవితో తెరుచుకోకపోతే తాళంకప్ప పగలగొట్టి తలుపులు తెరవనున్నట్లు సమాచారం.

ఒడిశాలోని పూరీ జగన్నాథుడికి చెందిన విలువైన ఆభరణాలను ఆలయంలోని ఓ రహస్య గదిలో భద్రపరిచారు. గతంలో మూడేళ్లు, ఐదేళ్లకు ఒకసారి గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు. చివరిసారిగా 1978లో ట్రెజరీలోని వజ్రాభరణాలను లెక్కించి భాండాగారం సీజ్ చేశారు. అప్పటి నుంచి మళ్లీ ఆ గది తెరవలేదు. అయితే, అప్పుడు కూడా కొన్ని ఆభరణాలను వెలకట్టలేక పక్కన పెట్టారని, గది తాళం దొరకడంలేదని.. ఇలా ఆలయ భాండాగారం చుట్టూ పలు వివాదాలు రేగాయి. అప్పటి నుంచి మళ్లీ ఈ గదిని తెరవలేదు. ఒడిశాలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇది కూడా కీలక అంశంగా మారింది. తాము అధికారంలోకి వస్తే ఆలయ భాండాగారం తెరిచి, జగన్నాథుడి సంపదను లెక్కిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఈ హామీని నిలబెట్టుకునే క్రమంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ భాండాగారం తెరిచేందుకు ఈ నెల 14 ను ముహూర్తంగా నిర్ణయించింది. 

అప్పట్లో లెక్కింపుకు 70 రోజులు..
1978లో భాండాగారంలోని సంపద లెక్కించేందుకు 70 రోజులు పట్టింది. లెక్కింపు తర్వాత ప్రకటించిన జాబితాలో స్వామి వారికి చెందిన పలు ఆభరణాల పేర్లు కనిపించలేదు. దీనిపై హైకోర్టులో ఓ వ్యాజ్యం దాఖలైంది. విచారణ జరిపిన న్యాయస్థానం భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించింది. ఈ క్రమంలో ఆభరణాల లెక్కింపు, గది మరమ్మతుల కోసం 2019లో నవీన్ పట్నాయక్ సర్కారు 13 మందితో కమిటీ ఏర్పాటు చేసింది. అదే ఏడాది ఏప్రిల్ 16న భాండాగారం తలుపు తెరిచేందుకు వెళ్లిన ఈ కమిటీ సభ్యులు.. తాళంచెవి కనిపించకపోవడంతో వెనుదిరిగారు. భాండాగారానికి సంబంధించిన డూప్లికేట్ తాళంచెవి పూరీ కలెక్టరేట్ ట్రెజరీలో ఉందని గుర్తించారు. ప్రస్తుతం ఈ తాళం చెవి సాయంతో గది తలుపులు తెరవనున్నారు.

  • Loading...

More Telugu News