Mihir Shah: మొత్తానికి మూడు రోజుల తర్వాత చిక్కిన మిహిర్ షా.. పోలీసులు పట్టుకున్నారిలా!

Mumbai police at last arrested politician son Mihir Shah in hit and run case

  • బైక్‌పై వెళ్తున్న దంపతులను ఢీకొట్టిన నిందితుడు రాజేశ్ షా
  • ఆపై మహిళను 1.5 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన వైనం
  • అదే రోజు డ్రైవర్, మిహిర్ తండ్రి అరెస్ట్
  • కుటుంబ సభ్యులందరూ ఫోన్లు ఆఫ్ చేసుకోవడంతో చిక్కని ఆచూకీ
  • స్నేహితుడి ఫోన్ 15 నిమిషాలు పాటు ఆన్ కావడంతో లొకేషన్ గుర్తింపు
  • నిందితుడు మిహిర్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

ముంబై బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడైన శివసేన (షిండే వర్గం) నేత రాజేశ్ షా కుమారుడు మిహిర్‌ షాను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్రెండ్స్‌తో పబ్‌లో పార్టీ అనంతరం లగ్జరీ కారులో ఇంటికి వెళ్తూ ఆదివారం తెల్లవారుజామున స్కూటర్‌పై వెళ్తున్న జంటను మిహిర్ ఢీకొట్టాడు. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తర్వాత మిహిర్ అక్కడి నుంచి పరారయ్యాడు. అతడిని పట్టుకునేందుకు పలు బృందాలుగా విడిపోయిన పోలీసులు ఎట్టకేలకు మూడు రోజుల తర్వాత అదుపులోకి తీసుకున్నారు.

ఘటన తర్వాత పరారైన మిహిర్‌తోపాటు అతడి తల్లి, సోదరి మొబైల్ ఫోన్లు కూడా స్విచ్చాఫ్ అయ్యాయి. దీంతో నిందితుడి ఆచూకీ కనుక్కోవడం పోలీసులకు సవాలుగా మారింది. చివరికి అతడి స్నేహితుడి ఫోన్‌ను ట్రాప్ చేసి నిందితుడికి అరదండాలు వేయగలిగారు. 

మహిళను 1.5 కి.మీ. ఈడ్చుకెళ్లాడు
ప్రమాద సమయంలో కారు నడిపింది మిహిర్ షానేనని పోలీసులు నిర్ధారించారు. మిహిర్ కారు నడుపుతుంటే డ్రైవర్ రాజ్‌రిషి బిదావత్ వెనక సీట్లో కూర్చున్నాడు. స్కూటర్‌ను ఢీకొట్టిన మిహిర్ షా.. మహిళ కావేరి నఖ్వాను 1.5 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు. ఆ తర్వాత డ్రైవర్ తన స్థానంలోకి రాగా, మిహిర్ వెనక సీట్లోకి వెళ్లాడు. ఆ తర్వాత కారును రివర్స్ చేసి మహిళ శరీరాన్ని తొక్కించి వెళ్లిపోయారు. అక్కడి నుంచి షా అదృశ్యమయ్యాడు. 

బాంద్రాలో కారు వదిలి గాళ్‌ఫ్రెండ్ ఇంటికి
ఘటనా స్థలం నుంచి పరారైన నిందితుడు బంద్రాలోని కాలానగర్‌లో కారును వదిలి గోరేగావ్‌లోని గాళ్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు. విషయం చెప్పడంతో ఆమె నిందితుడి సోదరికి ఫోన్ చేసి ప్రమాదం గురించి చెప్పింది. వెంటనే అక్కడికి చేరుకున్న ఆమె నిందితుడిని తీసుకుని బొరీవలీలోని తన ఇంటికి తీసుకెళ్లింది. ఆ తర్వాత నిందితుడి తల్లి మీనా, ఇద్దరు తోబుట్టువులు పూజా, కింజాల్, స్నేహితుడు అవదీప్ కలిసి ముంబైకి 70 కిలోమీటర్ల దూరంలోని షపూర్‌ రిసార్ట్‌కు వెళ్లారు. 

పోలీసులు ఎలా పట్టుకున్నారంటే 
8న రాత్రి కుటుంబ సభ్యులను వదిలిపెట్టి స్నేహితుడితో కలిసి మిహిర్ ముంబైకి 65 కిలోమీటర్ల దూరంలోని విరార్‌కు వచ్చాడు. నిన్న ఉదయం అతడి స్నేహితుడు 15 నిమిషాలపాటు తన ఫోన్‌ను ఆన్‌చేశాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు లొకేషన్ గుర్తించి మిహిర్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడి తల్లి, ఇద్దరు తోబుట్టువులు సహా ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. 

తండ్రి సలహాతోనే పరార్
ప్రమాదం తర్వాత తండ్రికి ఫోన్ చేసిన మిహిర్ ఆయన సలహాతోనే పరారయ్యాడు. కుమారుడి ఫోన్‌తో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రాజేశ్ షా కారును అక్కడి నుంచి లాక్కుపోయే ప్రయత్నం చేశారు. అయితే, మృతురాలు కావేరి భర్త అప్రమత్తం చేయడంతో పోలీసులు రాజేశ్‌షా, డ్రైవర్ బిదావత్‌ను అరెస్ట్ చేశారు. మిహిర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ, ఒక రోజు పోలీస్ కస్టడీ విధించింది. కాగా, రాజేశ్ షాకు మాత్రం అరెస్ట్ అయిన రోజ బెయిలు లభించింది.

  • Loading...

More Telugu News