KTR: ప్రభుత్వభూమి తనఖా పెట్టి నిధుల సమీకరణ.. రేవంత్ సర్కారుపై కేటీఆర్ సంచలన ఆరోపణలు

KTR criticised that Revant Reddy Government unable to run financial sector properly

  • ప్రభుత్వభూములను ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు తనఖాపెడతారని సమాచారం ఉందన్న కేటీఆర్
  • రూ.10 వేల కోట్ల సమీకరణకు రూ.100 కోట్ల కమీషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందంటూ ఆరోపణలు
  • నిధుల సమీకరణకు ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకుందన్న బీఆర్ఎస్ నేత

సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన 20 వేల కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు ప్రభుత్వం తనఖాపెట్టాలని యోచిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. రూ.10 వేల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం ఉందన్నారు. దీనికి మధ్యవర్తిగా ఒక మర్చంట్ బ్యాంకర్‌ను పెట్టి వారికి రూ.100 కోట్ల కమీషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందని, ఈ మేరకు మీడియాలో కథనాలు వస్తున్నాయని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఓ దిన పత్రికలో వచ్చిన కథనాన్ని కేటీఆర్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు.

రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం రేవంత్ సర్కార్‌కు చేతకావడం లేదని, నిధుల సమీకరణకు ఒక ప్రమాదకరమైన మార్గం ఎంచుకుందని కేటీఆర్ అన్నారు. మతిలేని ఈ చర్య వల్ల తెలంగాణ ప్రగతి శాశ్వతంగా కుంటుపడుతుందని అన్నారు. కొత్తగా పెట్టుబడులు, పరిశ్రమలు రాక, ఉద్యోగాలు రాక, బిడ్డలకు కొలువులు రాకుండా పోయే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

కోకాపేట, రాయదుర్గం వంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఐటీ పరిశ్రమలు వస్తున్నాయని, అలాంటి చోట 400 ఎకరాలు ప్రైవేట్‌ సంస్థలకు తనఖా పెట్టడం అనాలోచిత చర్య అని కేటీఆర్ విమర్శించారు. అసలే గత 7 నెలలుగా రాష్ట్ర పారిశ్రామికరంగం స్తబ్దుగా ఉందని, కొత్తగా పెట్టుబడులు రావడం లేదని అన్నారు. ఉన్న కంపెనీలు కూడా సరైన ప్రోత్సాహం లేక పక్కచూపులు చూస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం పరిశ్రమలకు ఇచ్చే భూములు తాకట్టు పెడితే కంపెనీలకు ఏమిస్తారని ప్రశ్నించారు. కొత్తగా యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయని నిలదీశారు.

  • Loading...

More Telugu News