Prime Minister: 41 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ.. మళ్లీ ఇప్పుడు మోదీ!

PM Modi Arrives In Austria 1st Visit By Indian PM In Over 40 Years

  • ఆస్ట్రియాలో 4 దశాబ్దాల తర్వాత పర్యటించిన రెండో భారత ప్రధానిగా రికార్డు
  • రెండు రోజుల పర్యటన కోసం రష్యా నుంచి ఆస్ట్రియా చేరుకున్న మోదీ
  • ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఆ దేశాధ్యక్షుడు బెల్లెన్, చాన్స్ లర్ కార్ల్ నెహమ్మెర్ తో నేడు చర్చలు

రష్యా పర్యటన ముగించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ మాస్కో నుంచి మంగళవారం రాత్రి ఆస్ట్రియా రాజధాని వియన్నా చేరుకున్నారు. తద్వారా 1983లో ఇందిరా గాంధీ పర్యటించిన 41 ఏళ్ల తర్వాత ఆస్ట్రియాలో పర్యటించిన రెండో ప్రధానిగా నిలిచారు.

ఎయిర్ పోర్టులో ఆయనకు ఆస్ట్రియా విదేశాంగ మంత్రి అలెగ్జాండర్ స్కాల్లెన్ బర్గ్ తోపాటు ఆస్ట్రియాలో భారత రాయబారి శంభు కుమరన్ ఘన స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోదీ తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. వియన్నాలో అడుగుపెట్టినట్లు పేర్కొన్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

దీనిపై ఆ దేశ చాన్స్ లర్ కార్ల్ నెహమ్మెర్ స్పందించారు. ‘వియన్నా చేరుకున్న ప్రధాని మోదీకి స్వాగతం. ఆస్ట్రియాకు స్వాగతించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. మన రాజకీయ, ఆర్థిక చర్చల కోసం ఎదురుచూస్తున్నా’ అని నెహమ్మెర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అనంతరం మోదీ గౌరవార్థం హోటల్ రిట్జ్ –కార్ల్ టన్ లో ఏర్పాటు చేసిన ప్రైవేటు విందులో నెహమ్మెర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీతో కలిసి దిగిన ఫొటోను నెటిజన్లతో పంచుకున్నారు. మరోవైపు హోటల్ లోకి అడుగుపెట్టిన ప్రధాని మోదీకి ఆస్ట్రియా కళాకారులు, వయొలిన్ విద్వాంసులు వందేమాతరం గేయం ఆలపిస్తూ స్వాగతం పలికారు.

ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, భౌగోళిక, రాజకీయ సవాళ్లపై మరింత మెరుగైన సహకారం దిశగా ఆస్ట్రియాతో మోదీ చర్చలు జరపనున్నారు. ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డర్ బెల్లెన్ తోపాటు ఆ దేశ చాన్స్ లర్ కార్ల్ నెహమ్మెర్ తో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. అలాగే ఇరు దేశాలకు చెందిన వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ఆస్ట్రియా పర్యటనకు బయలుదేరే ముందు మోదీ మాట్లాడుతూ ‘ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, చట్టపాలన విషయంలో భారత్–ఆస్ట్రియా ఒకే రకమైన విలువలను కలిగి ఉన్నాయి. ఆ పునాదులపై ఇరు దేశాలు మరింత సన్నిహిత భాగస్వామ్యాన్ని నిర్మించనున్నాయి’ అని పేర్కొన్నారు.

అంతకుముందు మోదీ పర్యటనను స్వాగతిస్తూ ఆస్ట్రియా చాన్స్ లర్ నెహమ్మెర్ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకి ఎదురుచూస్తున్నా. ఈ పర్యటన ఎంతో ప్రత్యేకమైనది. 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని తొలిసారి మా దేశానికి రానున్నారు. భారత్ తో దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సంబరాల వేళ మోదీ పర్యటన కీలక మైలురాయిగా నిలవనుంది’ అని నెహమ్మెర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News