Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గా నియమితుడవడం పట్ల గంభీర్ స్పందన

Gautam Gambhir responds after getting appointed as Team India head coach

  • ముగిసిన రాహుల్ ద్రావిడ్ పదవీకాలం
  • భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్ గా గౌతమ్ గంభీర్ నియామకం
  • నేడు ప్రకటన చేసిన బీసీసీఐ కార్యదర్శి జై షా

భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ను నియమిస్తూ నేడు బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటన చేశారు. టీమిండియా కొత్త కోచ్ గా నియమితుడవడం పట్ల గౌతమ్ గంభీర్ వినమ్రంగా స్పందించారు. 

"జై షా భాయ్... నా గురించి మీరు పలికిన మంచి మాటలకు, మీరు అందిస్తున్న స్థిరమైన మద్దతుకు కృతజ్ఞతలు. టీమిండియా ప్రయాణంలో భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఓ జట్టుగా మేమంతా కలిసి అద్భుతమైన ఫలితాలు సాధించడం కోసం, కొత్త ఎత్తులను అధిరోహించడం కోసం కృషి చేస్తాం" అని గంభీర్ ట్వీట్ చేశారు. 

"నా మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించడం కోసం, నా దేశం కోసం, నా ప్రజల కోసం  సేవలు అందించేందుకు నాకు లభించిన గౌరవం ఇది. టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించేందుకు ఉద్విగ్నతకు లోనవుతున్నాను. ఇప్పటివరకు టీమిండియాను విజయవంతంగా నడిపించిన రాహుల్ ద్రావిడ్ కు, ఆయన బృందానికి అభినందనలు తెలుపుకుంటున్నాను" అంటూ గంభీర్ పేర్కొన్నారు.

 కాగా, టీమిండియా కోచ్ గా తాను రావాలంటే... తాను సూచించిన వాళ్లనే అసిస్టెంట్ కోచ్ లు గా తీసుకోవాలని గంభీర్ ఓ షరతు విధించినట్టు తెలుస్తోంది. బ్యాటింగ్ కోచ్ గా అభిషేక్ నాయర్ (ముంబయి), బౌలింగ్ కోచ్ గా వినయ్ కుమార్ (కర్ణాటక) లను తన బృందంలోకి తీసుకోవాలన్నది గంభీర్ ఆలోచన అని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News