KTR: హరీశ్ రావు, కేటీఆర్‌లకు ఢిల్లీలో ఏం పని?: కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

Congress MLA question to Harish Rao and KTR

  • బీఆర్ఎస్ నుంచి 25 మంది కాంగ్రెస్‌లో చేరుతారన్న బీర్ల ఐలయ్య
  • త్వరలోనే బీఆర్ఎస్ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనమవుతుందని జోస్యం
  • రేవంత్ రెడ్డి పాలన నచ్చి కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న ఎమ్మెల్యే
  • గల్లీలో మొహం చెల్లక ఢిల్లీకి వెళ్లి మాట్లాడుతున్నారని విమర్శ

రేవంత్ రెడ్డి పాలన నచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారని జోస్యం చెప్పారు. త్వరలోనే బీఆర్ఎస్ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం అవుతుందన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారడం... బీఆర్ఎస్ చేస్తే సంసారం... తాము చేస్తే వ్యభిచారమా? అని ప్రశ్నించారు. తాము ఫిరాయింపులకు పాల్పడటం లేదన్నారు. కాంగ్రెస్ పాలన నచ్చి వారు తమ పార్టీలో చేరుతున్నారన్నారు.

తాము ప్రలోభాలు పెట్టి ఎమ్మెల్సీలను తీసుకోవడం లేదని పేర్కొన్నారు. గల్లీలో మొహం చెల్లని బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు హరీశ్ రావు, కేటీఆర్‌లకు ఢిల్లీలో ఏం పని? అని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీకి ఢిల్లీలో ఏం పని ఉందో చెప్పాలన్నారు. బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసేందుకే కేటీఆర్, హరీశ్ రావులు ఢిల్లీకి వెళ్లారని ఆరోపించారు. చివరికి బీఆర్ఎస్ పార్టీలో మిగిలేది నలుగురేనని... మిగిలిన ఆ నలుగురు పాడె మోస్తారని ఎద్దేవా చేశారు. 

కాంగ్రెస్ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదన్నారు. గడీల పాలన చేసినందువల్లే... ఆ గడీలను బద్దలుకొట్టి ప్రజాపాలన తెచ్చామన్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్, సురేష్ రెడ్డిలకు ఏమాత్రం బుద్ధి లేదని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర పెట్టి కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పనులను ఊరూరా చెప్పాలన్నారు.  

More Telugu News