Gas Cylinder: వంట గ్యాస్ ఈకేవైసీ డెడ్ లైన్ గడువుపై క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి

No deadline for LPG eKYC compliance says Hardeep Singh Puri

  • ఏజెన్సీల వద్ద మాత్రమే ఈకేవైసీ నమోదు చేయాలన్న వాదన పైనా క్లారిటీ
  • ఈకేవైసీకీ తుది గడువు లేదన్న కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పూరి
  • ఈకేవైసీ గ్యాస్ ఏజెన్సీల వద్దనే చేసుకోవాలనేమీ లేదని వెల్లడి
  • కేవైసీ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఎలాంటి తుది గడువు లేదని వెల్లడి

గ్యాస్ వినియోగదారుల ఈకేవైసీ గడువు, ఇతర అంశాలపై కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పూరి మంగళవారం స్పష్టతనిచ్చారు. కొన్ని నెలలుగా గ్యాస్ కంపెనీలు ఈకేవైసీని చేపడుతున్నాయి. గ్యాస్ ఏజెన్సీల వద్ద మాత్రమే ఈకేవైసీ నమోదు చేయాలని కొన్ని కంపెనీలు పట్టుబడుతున్నాయంటూ కేరళ శాసన సభ ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ కేంద్రమంత్రికి లేఖ రాశారు. ఈ లేఖపై కేంద్రమంత్రి స్పందించారు.

బోగస్ కస్టమర్లను తొలగించేందుకే చమురు మార్కెటింగ్ సంస్థలు ఈకేవైసీ ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియను చేపడుతున్నాయని తెలిపారు. గత ఎనిమిది నెలలుగా ఇది కొనసాగుతోందన్నారు. ఎల్పీజీ డెలివరీ సిబ్బంది గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేసే సమయంలోనే కస్టమర్ల వివరాలను వెరిఫై చేస్తారని తెలిపారు. వారి మొబైల్ ఫోన్లలోని యాప్‌తో వినియోగదారుల ఆధార్ వివరాలను నమోదు చేసుకొని ఈ ప్రక్రియను పూర్తి చేస్తారని తెలిపారు. అలాగే, కస్టమర్లు తమ సౌలభ్యం మేరకు దగ్గరలోని డిస్ట్రిబ్యూటర్ షోరూంకు వెళ్లి కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చునని తెలిపారు. అలాగే, చమురు మార్కెటింగ్ సంస్థల యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని సొంతంగా కేవైసీని అప్ డేట్ చేసుకోవచ్చని వివరించారు.

కేవైసీ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఎలాంటి తుది గడువు లేదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. చమురు సంస్థలు లేదా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి తుది గడువు విధించలేదన్నారు. ఎల్పీజీ ఏజెన్సీలలోనే ఈకేవైసీని పూర్తి చేయాలనే కచ్చితమైన నిబంధన ఏదీ లేదన్నారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.

  • Loading...

More Telugu News