Jayadevanaidu: సీబీఐ పేరుతో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యేకు రూ. 50 లక్షల టోకరా

Ex MLA Jayadeva Naidu Cheated By Cyber Criminals  Rs 50 Lakhs In The Name Of CBI

  • శనివారం జయదేవనాయుడికి ఫోన్ చేసిన మహిళ
  • మీ ఖాతా నుంచి మనీల్యాండరింగ్ జరిగిందని బెదిరించిన వైనం
  • లైన్లోకొచ్చిన మరో నిందితుడు
  • ఆయన సూచనతో రూ. 50 లక్షలు ట్రాన్స్‌ఫర్
  • దర్యాప్తు చేస్తున్న పాకాల పోలీసులు

చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఎన్ఆర్ జయదేవనాయుడు (85) మోసగాళ్ల చేతిలో చిక్కి రూ. 50 లక్షలు పోగొట్టుకున్నారు. గత శనివారం ఆయనకు ఫోన్ చేసిన ఓ మహిళ మీ బ్యాంకు ఖాతా నుంచి కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయని, తాము అరెస్ట్ చేసిన నాయక్ అనే వ్యక్తి బ్యాంకు ఖాతాలను తనిఖీ చేసినప్పుడు ఈ విషయం బయటపడిందని చెప్పింది. మనీల్యాండరింగ్ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని బెదిరించింది.

మనీల్యాండరింగ్‌తో తనకు ఎలాంటి సంబంధమూ లేదని జయదేవనాయుడు తేల్చి చెప్పడంతో, అయితే తమ పై అధికారితో మాట్లాడాలంటూ ఫోన్‌ను మరో వ్యక్తికి కనెక్ట్ చేసింది. అతడు మాజీ ఎమ్మెల్యేతో మాట్లాడుతూ తాము ఫోన్ చేసిన విషయం ఎవరికీ చెప్పొద్దని, బయటకు తెలిస్తే వెంటనే అరెస్ట్ చేస్తారని చెప్పి మరింత బెదిరించాడు.

తాము సీబీఐ అకౌంట్ నంబర్ పంపిస్తామని, ఆ ఖాతాకు మీ ఖాతాలోని డబ్బులు పంపిస్తే తనిఖీ చేసి మూడు రోజుల్లో తిరిగి డబ్బులు బదిలీ చేస్తామని చెప్పడంతో నిజమేనని నమ్మిన జయదేవనాయుడు శనివారం బ్యాంకుకు వెళ్లి ఆరు ఖాతాల నుంచి ఆర్టీజీఎస్ ద్వారా రూ. 50 లక్షలు పంపించారు. 

ఆదివారం అమెరికా నుంచి కుమారుడు ఫోన్ చేస్తే జరిగిన విషయం చెప్పారు. దీంతో ఆయన మోసపోయినట్టు గ్రహించి వెంటనే ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆయన సూచన మేరకు నిన్న సాయంత్రం జయదేవనాయుడు తిరుపతి జిల్లా పాకాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News