Rejesh Babu: అసోంలో హత్యకు గురైన ఒంగోలు అధ్యాపకుడి అంత్యక్రియల పూర్తి
- 13 ఏళ్ల క్రితం అసోంలో కాలేజీ స్థాపించిన రాజేశ్‌బాబు
- గణితంలో మార్కులు తక్కువ వచ్చాయని మందలించిన గణితం లెక్చరర్
- అవమానంగా భావించి రాజేశ్‌బాబు క్లాస్ చెబుతుండగా కత్తితో దాడి
- ఆసుపత్రికి తరలించేలోపే మృతి
అసోంలో సొంత విద్యార్థి చేతిలోనే దారుణ హత్యకు గురైన ఒంగోలు అధ్యాపకుడు రాజేశ్‌బాబు అంత్యక్రియలు నిన్న స్వగ్రామంలో అశ్రునయనాల మధ్య జరిగాయి. అన్నవరప్పాడుకు చెందిన బెజవాడ రాజేశ్‌బాబు మిత్రులతో కలిసి అసోంలోని శివసాగర్ ప్రాంతంలో 13 సంవత్సరాల క్రితం కళాశాల ఏర్పాటు చేశారు. ఆయన ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తుండగా, ఆయన భార్య అపర్ణ డైరెక్టర్‌గా ఉన్నారు.
ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థికి గణితంలో మార్కులు తక్కువగా రావడంతో పాటు అతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో శనివారం గణిత అధ్యాపకుడు మందలించారు. ఇంటికెళ్లి పెద్దలను తీసుకురావాలని చెప్పారు. ఆ సమయంలో ప్రిన్సిపాల్ రాజేశ్‌బాబు అక్కడే ఉన్నారు. తనను మందలించడాన్ని అవమానంగా భావించిన విద్యార్థి ఇంటికెళ్లి కత్తితో వచ్చి క్లాస్‌రూములో కూర్చొన్నాడు.
రాజేశ్‌బాబు కెమిస్ట్రీ క్లాస్ చెబుతుండగా ఒక్కసారిగా కత్తితో దాడిచేశాడు. తల, చాతీపై విచక్షణ రహితంగా పొడిచాడు. ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు. రాజేశ్‌బాబుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.