Jogi Ramesh: తప్పుడు కేసులతో నన్ను జైలుకు పంపాలని చూస్తున్నారు: జోగి రమేశ్

Jogi Ramesh fires on goivt

  • అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేసినట్టు మాజీ మంత్రి జోగి రమేశ్ పై ఆరోపణలు
  • తనపై కేసులు పెట్టడానికి తహతహలాడుతున్నారన్న జోగి రమేశ్
  • మీకు ఇదేం ఆనందం? అంటూ వ్యాఖ్యలు

అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేశ్ మీడియాతో మాట్లాడారు. తప్పుడు కేసులతో తనను జైలుకు పంపాలని చూస్తున్నారని ఆరోపించారు. 

అగ్రిగోల్డ్ భూముల సర్వే నెంబర్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉంటాయని, అలాంటప్పుడు ఆ భూములను ఎవరి పేరు మీద అయినా ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని జోగి రమేశ్ ప్రశ్నించారు. తాము మహాలక్ష్మి ప్రాపర్టీస్ నుంచి స్థలాలు కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని, ఈనాడు పేపర్ లో ప్రకటన కూడా ఇచ్చామని వెల్లడించారు. 

ఆ భూములను తమ వద్ద నుంచి కొనుక్కున్న వాళ్లు కూడా సర్వే చేయించి, కొలతలు తీయించి, పేపర్లో ప్రకటన ఇచ్చి మరీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వివరించారు. అవి అగ్రిగోల్డ్ భూములే అయితే రిజిస్ట్రేషన్ కు అధికారులు నిరాకరించేవాళ్లు కదా? అని జోగి రమేశ్ వ్యాఖ్యానించారు. కానీ, కొన్ని పేపర్ల వాళ్లు కబ్జాలు అంటూ దుర్మార్గమైన భాష వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

"ఇవాళ నా మీద కేసు పెట్టడానికి తహతహలాడుతున్నారు. రండి... కేసులు పెట్టుకోండి. అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి అనుకుంటున్నారు. రెడ్ బుక్ తీస్తావో, రక్తచరిత్ర తీస్తావో, మా ఇంటి మీద దాడి చేయిస్తావో... ఏం చేస్తారో చేయండి. మమ్మల్ని చంపించాలని కూడా అనుకుంటున్నారట. అది కూడా చేయండి. ప్రజలు అంతా చూస్తూనే ఉంటారు. 

10 రోజులో, నెలో, రెండు నెలలో సబ్ జైలులో పెడతావేమో... మళ్లీ మేం బయటికి రాలేమా...! మీరేదో సూపర్-6 అమలు చేస్తారని ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. అమరావతి నిర్మించండి, పోలవరం కట్టండి... ప్రజలతో పాటు మేం కూడా హర్షిస్తాం. మీరు మంచి పనులు చేస్తే మేం కూడా సంతోషిస్తాం. 

కానీ, మాపై కేసులు పెట్టాలి, మమ్మల్ని అరెస్ట్ చేయాలి... ఇంత ఆనందం ఏమిటి మీకు? ఈ ఆనందం కోసమా మీకు ప్రజలు అధికారం ఇచ్చింది?" అంటూ జోగి రమేశ్ ధ్వజమెత్తారు.

Jogi Ramesh
Agri Gold
YSRCP
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh
  • Loading...

More Telugu News