Undavalli Arun Kumar: రేవంత్ రెడ్డి గారూ... మీ ముందు ఒక మహత్తరమైన అవకాశం ఉంది: ఉండవల్లి అరుణ్ కుమార్

Undavalli Arun Kumar interesting comments on CM Revanth Reddy

  • మంగళగిరిలో వైఎస్సార్ 75వ శతజయంతి వేడుకలు
  • ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
  • తన ప్రసంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ ఉండవల్లి

మంగళగిరిలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ 75వ జయంతి వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

"వైఎస్సార్ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. ఇవాళ ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు... ఓ మాట చెప్పకపోతే బాగుండదు. రేవంత్ రెడ్డి గారూ... ఇవాళ మీ ముందుకు ఒక మహత్తరమైన అవకాశం వచ్చింది. ఆంధ్రా, తెలంగాణ మధ్య శాశ్వతంగా ఒక అనుబంధాన్ని కల్పించే అవకాశం మీకు వచ్చింది. ఈ మాట ఎందుకన్నానంటే... ఇది కాంగ్రెస్ వాళ్లే చేయగలరు. జెనెటిక్ గా కాంగ్రెస్ ముఖ్యమంత్రే ఈ పని చేయగలడు. 

ఆంధ్రా వాళ్లకు ఏనాడు కూడా తెలంగాణ వాళ్లపై ఎలాంటి కోపం లేదు, ఏ రకమైన ద్వేషం లేదు... అది మీకు కూడా తెలుసు. కానీ మీకు మా మీద కోపం వచ్చింది... దానికో కారణం ఉంది... అది మాకు తెలుసు. 

పొన్నం ప్రభాకర్, నేను ఐదేళ్లు మాట్లాడుకోలేదు. అప్పట్లో ఇద్దరం ఎంపీలం... బాగా క్లోజ్ గా ఉండేవాళ్లం. ఎదురుపడినా పలకరించుకోలేని పరిస్థితి. రుద్రరాజు తండ్రి చనిపోయిన సమయంలో మళ్లీ పలకరించుకున్నాం. "ఏం పొన్నం" అంటే "ఏం అరుణా" అన్నాడు. ఏంటంటే... రాజకీయ కారణాలే. 

రేవంత్ రెడ్డి గారూ... ఒక్కసారి ఈ కారణాలన్నింటిపై మీరు దృష్టి పెడితే కచ్చితంగా వీటిని సెటిల్ చేయవచ్చు. ఏపీ, తెలంగాణ టెక్నికల్ గా రెండు రాష్ట్రాలు తప్ప... రెండు రాష్ట్రాల ప్రజలు ఒక్కటే అనే సందేశం మీరు ఇవ్వగలరు. అందుకోసం పాలనా పరంగా ముఖ్యమంత్రులుగా మీరేం చేస్తారో ఎలాగూ చేస్తారు. 

ఈ వేదికపై రాజశేఖర్ రెడ్డి కూతురు (షర్మిల) కూడా ఉంది... ఆ సంగతి మర్చిపోవద్దు. ఏపీ ప్రజలకు ఏం చేస్తే నష్టం లేకుండా ఉంటుందో, రాజశేఖర్ రెడ్డి కూతురును కూడా కలుపుకుని ఆ విధంగా ముందుకు వెళ్లండి. కేవీపీ రామచంద్రరావు వంటి నేత హైదరాబాదులోనే ఉంటున్నారు... ఆయన నుంచి మీకు సహకారం అందుతుంది. కచ్చితంగా ఈ క్రెడిట్ మీకు దక్కడం కోసం మీరు ముఖ్యమంత్రి అయ్యారని భావిస్తున్నాను. రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి" అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఉండవల్లి అరుణ్ కుమార్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

More Telugu News