Nara Lokesh: ఎడ్యుకేషన్ మినిస్టర్ గా కరెక్ట్ పర్సన్ వచ్చాడనిపించింది: ఓ దివ్యాంగ విద్యార్థి తండ్రి

Nara Lokesh held meeting with disabled students and their parents

  • మంత్రి లోకేశ్ చొరవతో 25 మంది దివ్యాంగ విద్యార్థులకు ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్లు
  • నేడు లోకేశ్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు
  • తన భావోద్వేగాలను నారా లోకేశ్ తో పంచుకున్న ఓ విద్యార్థి తండ్రి

ఏపీ మంత్రి నారా లోకేశ్ చొరవతో 25 మంది దివ్యాంగ విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు పొందగలిగారు. ఇవాళ ఆ దివ్యాంగ విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి మంగళగిరి వచ్చిన నారా లోకేశ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఓ దివ్యాంగ విద్యార్థి తండ్రి... వేదికపై ఉన్న నారా లోకేశ్ తో ముఖాముఖిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

"మా అబ్బాయికి ఓ విద్యా సంస్థలో చేరేందుకు అడ్మిషన్ కు సంబంధించిన సమస్య వచ్చింది. దాంతో మంగళగిరిలో ఉండే నా స్నేహితుడు కిశోర్ కు చెబితే, నారా లోకేశ్ గారిని నేరుగా ఇంటికి వెళ్లి కలవొచ్చు అని చెప్పాడు. నేను మీ (లోకేశ్) మీ ఇంటికి వచ్చాను సర్. అయితే మీరు ఇక్కడ లేరని, హైదరాబాద్ లో ఉన్నారని సెక్యూరిటీ వాళ్లు చెప్పారు. దాంతో, నా స్నేహితుడు కిశోర్ కు ఈ విషయం చెబితే, లోకేశ్ గారికి ఫోన్ చేయొద్దు, వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి... వెంటనే స్పందిస్తారు అని చెప్పాడు సర్. 

దాంతో మీకు మెసేజ్ పంపించాం. కేవలం అరగంటలోనే మీ నుంచి కాల్ వచ్చింది సర్. నిజంగా నమ్మలేకపోయాం. వారం రోజుల్లోనే సమస్య పరిష్కారం కావడంతో మాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఇదంతా మేం ఏమాత్రం ఊహించలేదు సర్. చంద్రబాబు గారు అన్నట్టు వ్యవస్థపై నమ్మకం, అనుభవం ఉన్న వాళ్లు వస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుందనేది ఈ ఘటన ద్వారా తెలుసుకున్నాం సర్. ఈ విషయంలో మా అబ్బాయి కానీ, మేం కానీ మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం సర్" అని ఆ వ్యక్తి భావోద్వేగాలతో వ్యాఖ్యానించారు. 

అందుకు నారా లోకేశ్ స్పందిస్తూ... "నాకు అనుభవం లేదులెండి. నేనింకా నేర్చుకుంటున్నా" అని వినమ్రంగా బదులిచ్చారు. అందుకా వ్యక్తి స్పందిస్తూ... నా ఉద్దేశంలో మీకు మంచి అవగాహన ఉంది సర్ అని వివరించారు. దాంతో నారా లోకేశ్ అందుకుని... "అవగాహన కంటే కూడా చేయాలన్న తపన ఉంది లెండి" అని పేర్కొన్నారు. 

చంద్రబాబు గారు చెప్పింది మేం నమ్మాం సర్... ఎడ్యుకేషన్ మినిస్టర్ గా కరెక్ట్ పర్సన్ వచ్చాడనిపిస్తోంది సర్. మా అబ్బాయి మీ బ్రాడ్ కాస్ట్ వీడియోలు చూస్తుంటాడు... నేను పేపర్లో వార్తలు చదువుతుంటాను... ఎప్పుడైనా ఈనాడు పేపర్లో సక్సెస్ స్టోరీలు చదవమని మా అబ్బాయికి ఇస్తే, వాడు ఆ పేపర్ పక్కన పడేసి మీ వీడియోలు చూస్తుంటాడు సర్... అని ఆ వ్యక్తి వివరించారు. 

అందుకు నారా లోకేశ్ స్పందిస్తూ... "మేమంతా యూట్యూబ్ జనరేషన్ లెండి" అని చమత్కరించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

  • Loading...

More Telugu News