Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేశ్ పై మంత్రులు నారా లోకేశ్, అనగాని సత్యప్రసాద్ లను ఆశ్రయించిన రంగబాబు అనే వ్యక్తి

Rangababu complains against Jogi Ramesh to Nara Lokesh and Anagani Satya Prasad

  • జోగి రమేశ్ పై భూ అక్రమాల ఆరోపణలు
  • జోగి రమేశ్ కు కొందరు అధికారులు సహకరించారన్న బాధితుడు
  • బంటుమిల్లి సబ్ రిజిస్ట్రార్ కు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి అనగాని

మాజీ మంత్రి  జోగి రమేశ్ భూ అక్రమాలకు పాల్పడ్డారంటూ రంగబాబు అనే వ్యక్తి నేడు ఏపీ మంత్రులు నారా లోకేశ్, అనగాని సత్యప్రసాద్ లను ఆశ్రయించారు. కృష్ణా జిల్లా కృత్తివెన్ను గ్రామంలో తాను భూమి అమ్ముతున్నానన్న విషయం తెలుసుకున్న జోగి రమేశ్... ఆ భూమిని కావాలనే వివాదాస్పద భూమిగా ముద్రవేయించారని, పొలం ఎందుకు వివాదంలోకి వెళ్లిందని ఎమ్మార్వోను అడిగితే, వెళ్లి జోగి రమేశ్ ను కలవమని చెప్పారని రంగబాబు వెల్లడించారు. 

దాంతో, కొందరు సన్నిహితులతో కలిసి జోగి రమేశ్ కు వద్దకు వెళితే సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని, కానీ రెండ్రోజుల తర్వాత శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తితో ఫోన్ చేయించి, రూ.15 లక్షలు ఇస్తేనే సమస్యను పరిష్కరిస్తానని చెప్పారని వివరించారు. చేసేది లేక వారు అడిగిన రూ.15 లక్షలు ఇచ్చానని, కానీ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి మూడు నెలల పాటు ఫోన్ ఎత్తలేదని, ప్రెస్ మీట్ పెడతానని హెచ్చరిస్తే అప్పుడు తన సమస్య పరిష్కరించారని రంగబాబు వివరించారు. 

అయితే, ఇప్పుడు తనకు చెందిన మరికొంత భూమిపై వారు కన్నేశారని తెలిపారు.  పెడన నియోజకవర్గంలో 30 ఎకరాల భూమికి నకిలీ దస్తావేజులు సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. జోగి రమేశ్ కు స్టాంపు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ, కొందరు సబ్ రిజిస్ట్రార్లు సహకరించారని రంగబాబు వివరించారు. 

జోగి రమేశ్ కు బంటుమిల్లి సబ్ రిజిస్ట్రార్ మద్దతుగా నిలుస్తున్నారని రంగబాబు... మంత్రులు నారా లోకేశ్, అనగాని సత్యప్రసాద్ లకు ఆయన వివరించారు. దీనిపై స్టాంపు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెంటనే స్పందించారు. బంటుమిలి సబ్ రిజిస్ట్రార్ కు ఫోన్ చేశారు. అక్రమాలకు సహకరిస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, బాధితుడు రంగబాబు... జోగి రమేశ్ పై సీఐడీకి ఫిర్యాదు చేస్తానని చెబుతున్నారు.

More Telugu News