Etela Rajender: కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల 300 మంది చిరుద్యోగులు, పేదలు రోడ్డున పడ్డారు: ఈటల
- చిరుద్యోగులు, పేదలు భూమి కొని... ఇళ్లు కట్టుకుంటే కూల్చేశారని ఈటల మండిపాటు
- అక్రమ భూములైతే ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఎలా వచ్చిందని ప్రశ్న
- పేదల ఇళ్ల జోలికి వెళ్లవద్దని ఎన్నోసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశానని వెల్లడి
కాంగ్రెస్ ప్రభుత్వం తీరువల్ల 300 మంది చిరుద్యోగులు రోడ్డున పడ్డారని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. సాయిప్రియ ఎన్‌క్లేవ్‌లో భూములు కొనుక్కొని ఇళ్లు నిర్మించుకుంటే వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసిందని ఆరోపించారు. చిన్న చిన్న ఉద్యోగులు, పేదలు ఇక్కడ తమ కష్టార్జితంతో భూములు కొనుగోలు చేశారని తెలిపారు. వీరు కొనుక్కున్న భూములను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసిందని మండిపడ్డారు.
భూముల ధరలు పెరిగాయని ఇప్పుడు కూల్చివేయడం దారుణమన్నారు. అవి అక్రమ భూములు అయితే నాడు ఇళ్ల నిర్మాణానికి, గృహ రుణాలకు ఎలా అనుమతి వచ్చిందని ప్రశ్నించారు. అన్ని అనుమతులతో నిర్మించిన ఇళ్లను ఎలా కూల్చివేస్తారని నిలదీశారు.
ఈ ప్రభుత్వ తీరు వల్ల వందలమంది ఇళ్లు లేని వారయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు, నాలుగు దశాబ్దాల క్రితం కొన్న భూముల గురించి ఇప్పుడు కలగజేసుకోవడం ఏమిటన్నారు. పేదల ఇళ్ల జోలికి వెళ్లవద్దని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశానని తెలిపారు.