Madhya Pradesh: పావుగంటలో మంత్రిగా రెండుసార్లు ప్రమాణం!

MLA Becomes Minister Twice in 15 Minutes In Bizarre OathTaking Ceremony

  • మధ్యప్రదేశ్ కేబినెట్ విస్తరణ సందర్భంగా విచిత్ర ఘటన
  • ఇటీవల బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్ నివాస్ రావత్ ను మంత్రివర్గంలోకి తీసుకున్న సీఎం మోహన్ యాదవ్
  • కాగితాల్లో పొరపాటు దొర్లడంతో తొలుత సహాయ మంత్రిగా ప్రమాణం, ఆ తర్వాత 15 నిమిషాలకు కేబినెట్ మంత్రిగా మరోసారి ప్రమాణస్వీకారం

మధ్యప్రదేశ్ లో సోమవారం జరిగిన కేబినెట్ విస్తరణలో అసాధారణ, విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. సజావుగా సాగాల్సిన ఈ ప్రక్రియ గందరగోళం మధ్య ముగిసింది.

ఏం జరిగిందంటే.. లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన కాంగ్రెస్ విజయపూర్ ఎమ్మెల్యే రామ్ నివాస్ రావత్ ను సీఎం మోహన్ యాదవ్ తన మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం సోమవారం రాజ్ భవన్ లో ప్రమాణస్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు. గవర్నర్ మంగూభాయ్ సి. పటేల్.. రామ్ నివాస్ రావత్ చేత ఉదయం 9 గంటల 3 నిమిషాలకు మంత్రిగా ప్రమాణం చేయించారు. అయితే కేబినెట్ మంత్రి బదులు సహాయ మంత్రిగా ఆయన పొరపాటున ప్రమాణస్వీకారం పూర్తి చేశారు.

చివరకు జరిగిన పొరపాటును గుర్తించి 15 నిమిషాల తర్వాత కేబినెట్ మంత్రిగా మరోసారి ఆయన ప్రమాణం చేశారు. కానీ ఈ కార్యక్రమం నిర్వహణా లోపాలను బయటపెట్టింది.

మంత్రిగా ప్రమాణం చేసిన రావత్ మరో వెరైటీ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వంలో మంత్రి అయిన తొలి వ్యక్తిగా నిలిచారు. ఎందుకంటే.. ఆయన ఇంకా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. గతేడాది జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

అలాగే ఒకేసారి రెండు మంత్రి పదవులు పొందిన అరుదైన నాయకుడిగానూ ఆయన మరో రికార్డును సొంతం చేసుకున్నారు. తొలిసారి సహాయ మంత్రిగా ప్రమాణం చేసిన ఆయన.. ఆ పదవికి రాజీనామా చేయకుండానే రెండోసారి కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేయడంతో సాంకేతికంగా ఆయన రెండు మంత్రి పదవులను కలిగి ఉన్నట్లయింది.

ప్రమాణస్వీకారం అనంతరం ఎన్డీటీవీ వార్తాసంస్థతో రావత్ మాట్లాడుతూ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరడంపై తనకు ఎలాంటి విచారం లేదని చెప్పుకొచ్చారు. ‘వాళ్లు (కాంగ్రెస్ నేతలు) నాకు ఏం ఇవ్వలేదో ఈ ప్రభుత్వం నాకు అది ఇచ్చి నన్ను గౌరవించింది’ అని రావత్ తెలిపారు. తాను పార్టీ మారినందుకు తిట్టిబోసే హక్కు కాంగ్రెస్ కు లేదని ఆయన స్పష్టం చేశారు. 

అలాగే అసాధారణ రీతిలో జరిగిన తన ప్రమాణంపైనా రావత్ స్పందించారు. ‘నేను పొరపాటున ‘కా’ అనే పదాన్ని చదవడం మర్చిపోయాను. అందుకే రెండోసారి ప్రమాణం చేశా. ఇలా ప్రమాణం చేసిన తొలి మంత్రిని నేనే’ అని రావత్ చెప్పారు.

మరోవైపు రావత్ పై అనర్హత వేటు వేయాలంటూ ఇప్పటికే స్పీకర్ నరేంద్రసింగ్ తొమర్ ను కోరిన కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారంపై వెంటనే స్పందించింది.

‘సీఎం మోహన్ యాదవ్ ప్రభుత్వం సుపరిపాలనకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పుకుంటోంది. కానీ ఇవాళ జరిగిన నిర్లక్ష్యం, పొరబాటు దేశంలో ఇప్పటివరకు జరగలేదు. ఈ విషయంలో ఇప్పుడు గందరగోళం నెలకొంది. గవర్నర్ కార్యాలయం నిర్లక్ష్యం వల్లో లేదా రాజకీయ పెద్దల ఒత్తిళ్ల వల్లో అలా జరిగి ఉండొచ్చు’ అంటూ పరోక్షంగా మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాలను ఉద్దేశించి కాంగ్రెస్ అధికార ప్రతినిధి అవనీష్ బుందేలా వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News