Ambati Rambabu: రెండు రాష్ట్రాలు రెండు కళ్లు అని చంద్రబాబు అంటున్నారు... దీనిపై అనుమానాలున్నాయి: అంబటి రాంబాబు

Ambati Rambabu slams AP CM Chandrababu

  • ఇటీవల హైదరాబాదులో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం
  • సీఎంల సమావేశం వివరాలు ఎందుకు బహిర్గతం చేయడంలేదన్న అంబటి
  • ఈ సమావేశంపై చాలా ప్రశ్నలకు సమాధానం లేదని వెల్లడి

ఇటీవల హైదరాబాదులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కావడంపై ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు తనకు రెండు రాష్ట్రాలు రెండు కళ్ల వంటివని చేసిన వ్యాఖ్యల పట్ల అంబటి సందేహాలు వ్యక్తం చేశారు. 

చంద్రబాబు తెలంగాణ డిమాండ్లను అంగీకరించినట్టేనా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన ఏం ద్రోహం చేయబోతున్నారు? రెండు రాష్ట్రాలు రెండు కళ్లు వంటివని అనడంలో అంతరార్థం ఏమిటి? దీని వెనుక ఏం కుట్ర ఉంది? ఇద్దరు సీఎంల సమావేశంలో ఏం చర్చించారు? ఎందుకు ఆ వివరాలను రహస్యంగా ఉంచుతున్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 

"ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చాలా ప్రశ్నలకు సమాధానం రాలేదు. ఆ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారో కూడా చెప్పలేదు. టీటీడీ ఆదాయంలో, ఏపీ పోర్టుల్లో వాటా కావాలని తెలంగాణ అడిగింది. నాగార్జున సాగర్ డ్యామ్ విషయంలో అనేక వివాదాలు ఉన్నాయి... దానిపై చంద్రబాబు మాట్లాడకపోవడం ఏంటి?" అని అంబటి ధ్వజమెత్తారు. 

"ఆంధ్రప్రదేశ్ విభజన జరిగాక రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు... కానీ, పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైదరాబాద్ ను వినియోగించుకోకుండా చంద్రబాబు ఎందుకు పారిపోయి వచ్చారు? తప్పు చేసినందునే మెడపట్టి గెంటేశారు. 

రాష్ట్ర విభజన వలన ఏపీకి తీవ్ర అన్యాయం జరిగితే... తెలంగాణతో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా చంద్రబాబు అంతకంటే ఎక్కువగా ఏపీకి అన్యాయం చేశారు. ఇప్పుడు ఐదు గ్రామాలను తెలంగాణకు ఇచ్చేసేందుకు చంద్రబాబు అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు పర్సనల్ విషయాల కోసం ఆ గ్రామాలను తెలంగాణకు ఇచ్చేస్తున్నారా? అదే నిజమైతే పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నట్టే. 

పోలవరంకు నష్టం జరిగింది కాంట్రాక్టరును మార్చడం వల్లో, రివర్స్ టెండరింగ్ వల్లనో కాదు... చంద్రబాబు హయాంలో కాఫర్ డ్యాంలు పూర్తి కాకుండానే డయాఫ్రం వాల్ కట్టడం వల్లే పోలవరంకు నష్టం జరిగింది. చంద్రబాబు నది మధ్యలో కాఫర్ డ్యామ్ కట్టడం వల్లే పోలవరం ఆలస్యం అయింది. 

మొన్నటి సీఎంల సమావేశంలో పోలవరంలో 51.5 అడుగుల వరకు నీటిని నింపవద్దని తెలంగాణ కోరినట్టు అనుమానంగా ఉంది. ఆ విషయాలేమీ మాట్లాడకుండా డ్రగ్స్ గురించి చెబుతారేంటి?" అంటూ అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.

  • Loading...

More Telugu News