Sandeshkhali: నిందితుడి విషయంలో మీకేం ఆసక్తి?... బెంగాల్ సర్కారును ప్రశ్నించిన సుప్రీంకోర్టు

Why Is State Interested In Protecting An Individual Top Court On Sandeshkhali Case

  • సందేశ్ ఖాలీ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆర్డర్
  • ఈ ఆర్డర్ పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన బెంగాల్ సర్కార్
  • సీబీఐ దర్యాఫ్తు నిలిపివేయాలని కోరుతూ పిటిషన్

బెంగాల్ లోని మమత సర్కారుకు దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి షాకిచ్చింది. ఓ నిందితుడిని కాపాడేందుకు సర్కారు ఎందుకు అంత తపన పడుతోందని నిలదీసింది. సందేశ్ ఖాలీలో లైంగిక వేధింపుల కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. సందేశ్ ఖాలీ గ్రామంలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, స్థానికుల భూములను ఆక్రమించుకున్నాడని టీఎంసీ లీడర్ షాజహాన్ షేక్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో షాజహాన్ ను టఎంసీ సస్పెండ్ చేసింది. పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ, టీఎంసీకి షాజహాన్ కు ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా, సందేశ్ ఖాలీ కేసులను కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. లైంగిక వేధింపులు, భూకబ్జా, రేషన్ స్కామ్.. తదితర ఆరోపణలతో నమోదైన 42 కేసులను విచారించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను టీఎంసీ సర్కారు సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కలకత్తా హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలని, సీబీఐ విచారణను నిలిపివేయాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.

నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కాపాడేందుకు బెంగాల్ ప్రభుత్వం కృషి చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని సుప్రీం బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ వ్యక్తి (షాజహాన్ షేక్) విషయంలో మీకు ఎందుకు అంత ఆసక్తి? అంటూ బెంగాల్ ప్రభుత్వ లాయర్ ను ప్రశ్నించింది. సందేశ్ ఖాలి కేసుల విచారణ నుంచి సీబీఐని తప్పించడం కుదరదని, కలకత్తా హైకోర్టు ఆర్డర్ సబబైందేనని స్పష్టం చేసింది. బెంగాల్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

  • Loading...

More Telugu News