BCCI: రూ. 125 కోట్ల బీసీసీఐ నజరానాలో రోహిత్, కోహ్లీ, ద్రవిడ్ వాటా ఎంతంటే..!

BCCIs Rs 125 Crore Prize For Team India Virat Kohli Rohit Sharma Rahul Dravids Share To Be

  • ఎవరికి ఎంత లభించనుందో వెల్లడించిన బీసీసీఐ వర్గాలు
  • రోహిత్, కోహ్లీ సహా రూ. 5 కోట్ల చొప్పున అందుకోనున్న జట్టులోని 15 మంది సభ్యులు
  • హెడ్ కోచ్ ద్రవిడ్ కు రూ. 5 కోట్లు, ఇతర కోచింగ్ సిబ్బందిలో ఒక్కొక్కరికీ రూ.  2.5 కోట్లు
  • సహాయ సిబ్బందికి రూ. 2 కోట్ల చొప్పున, రిజర్వ్ ఆటగాళ్లకు రూ. కోటి చొప్పున పంపిణీ
  • చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సహా క్రికెట్ సెలక్షన్ కమిటీ సభ్యులకు రూ. కోటి చొప్పున నజరానా

అమెరికా, వెస్టిండీస్ లలో జరిగిన ఇటీవలి టీ20 వరల్డ్ కప్ ను గెలుచుకున్న టీమిండియాకు బీసీసీఐ రూ. 125 కోట్ల నజరానా ప్రకటించడం తెలిసిందే. అయితే ఆ మొత్తంలో ఎవరెవరికి ఎంత అందుతుందో తాజాగా వెల్లడైంది. ఈ టోర్నీ కోసం మొత్తం 42 మంది సభ్యులతో టీమిండియా అమెరికా, వెస్టిండీస్ కు చేరుకుంది. అందులో 15 మంది ఆటగాళ్లతోపాటు రిజర్వ్ ఆటగాళ్లు, సహాయ సిబ్బంది ఉన్నారు.

దీంతో బీసీసీఐ ప్రకటించిన రూ. 125 కోట్ల నజరానాను మొత్తం 42 మందికి పంచనున్నారు. అయితే అందరికీ సమానంగా కాకుండా బృందంలో ఎవరెవరు ఎలాంటి పాత్ర పోషించారన్న దాని ఆధారంగా ఎవరికి ఎంత చెల్లించాలో బీసీసీఐ లెక్కగట్టింది.

దీని ప్రకారం జట్టులోని 11 మంది ఆటగాళ్లతోపాటు స్క్వాడ్ లోని మొత్తం 15 మంది సభ్యులు రూ. 5 కోట్ల చొప్పున అందుకోనున్నారు. అంటే కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా లాంటి స్టార్ ప్లేయర్లతోపాటు 15 మంది సభ్యుల జట్టులో ఉన్న ప్రతి ఒక్కరికీ రూ. 5 కోట్ల చొప్పున లభించనుంది. అలాగే హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం రూ. 5 కోట్లు అందుకోనున్నాడు.

ఇక ఇతర కోచింగ్ సిబ్బందికి రూ. 2.5 కోట్ల చొప్పున లభించనుంది. అంటే బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే రూ. 2.5 కోట్లు పొందనున్నారు. ఇక వరల్డ్ కప్ కు జట్టును ఎంపిక చేసిన చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సహా సెలక్షన్ కమిటీలోని ఇతర సభ్యులకు రూ. కోటి చొప్పున నజరానాను బీసీసీఐ అందించనుంది.

అలాగే సపోర్ట్ స్టాఫ్ లో ఉన్న ముగ్గురు ఫిజియోథెరపిస్టులు, ముగ్గురు త్రో డౌన్ స్పెషలిస్టులు, ఇద్దరు మసాజర్లు, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ కు రూ. 2 కోట్ల చొప్పున ముట్టనుంది.

వరల్డ్ కప్ కోసం 15 మంది జట్టు సభ్యులతోపాటు నలుగురు రిజర్వ్ ఆటగాళ్లను కూడా బీసీసీఐ ఎంపిక చేసింది. దీంతో రింకూసింగ్, శుభ్ మన్ గిల్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్ లకు రూ. కోటి చొప్పున నజరానా అందించనుంది.

ఆటగాళ్లతోపాటు సహాయ సిబ్బందికి ఎంత నజరానా లభిస్తుందో ఇప్పటికే తెలియజేశామని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించి ఇన్ వాయిస్ సమర్పించాల్సిందిగా కోరినట్లు చెప్పాయి.

మరోవైపు టీమిండియా స్వదేశం చేరుకోగానే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే రూ. 11 కోట్ల నజరానా ప్రకటించారు.

  • Loading...

More Telugu News