Rahul Gandhi: వైఎస్ఆర్ బతికి ఉంటే ఏపీ పరిస్థితి మరోలా ఉండేది: రాహుల్ గాంధీ
![Rahul Gandhi Special Video Message on YSR 75th Birth Anniversary](https://imgd.ap7am.com/thumbnail/cr-20240708tn668b79ab3487a.jpg)
- నేడు దివంగత సీఎం వైఎస్ఆర్ 75వ జయంతి
- ఈ సందర్భంగా 'ఎక్స్' వేదికగా రాహుల్ గాంధీ ప్రత్యేక వీడియో సందేశం
- ఆయనను కోల్పోవడం రాష్ట్ర ప్రజలకు తీరని లోటని వ్యాఖ్య
- వైఎస్ రాజకీయ వారసత్వాన్ని షర్మిల కొనసాగిస్తారని కాంగ్రెస్ అగ్రనేత ఆశాభావం
- భారత్ జోడో యాత్రకు ఒక రకంగా వైఎస్ పాదయాత్ర స్ఫూర్తి అన్న రాహుల్ గాంధీ
నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రత్యేకంగా ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ బతికి ఉంటే ఏపీ పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ఆయనను కోల్పోవడం రాష్ట్ర ప్రజలకు తీరని లోటని చెప్పారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని షర్మిల కొనసాగిస్తారని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ప్రారంభించిన భారత్ జోడో యాత్రకు ఒక రకంగా వైఎస్ఆర్ పాదయాత్ర స్ఫూర్తి అని అన్నారు.
ప్రజానీకానికి నిజమైన నాయకుడని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్, భారతదేశ ప్రజల అభ్యున్నతి, సాధికారత పట్ల ఆయన అంకితభావం, నిబద్ధత చాలా మందికి మార్గదర్శకమన్నారు. వ్యక్తిగతంగా ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజా జీవితానికే ప్రాధాన్యతనిచ్చిన మహా నాయకుడని రాహుల్ కొనియాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటున్నట్లు తెలిపారు.