Bomb Threat Call: బాయ్‌ఫ్రెండ్‌ను ఆపాలని ఎయిర్‌పోర్టుకు యువ‌తి బెదిరింపు కాల్‌.. చివ‌రికి జ‌రిగింది ఇదీ!

Woman makes hoax bomb threat to stop boyfriend at Bengaluru airport

  • బెంగళూరు నుంచి ముంబై వెళ్తున్న ప్రేమ జంట‌
  • అయితే ఇద్ద‌రివీ వేర్వేరు విమానాలు
  • దాంతో ప్రేయ‌సి ఇంద్రా రాజ్వ‌ర్ ఆక‌తాయి ప‌ని
  • త‌న‌ ప్రియుడు మీర్ రజా మెహదీ లగేజీలో బాంబు ఉందంటూ ఫేక్ కాల్‌
  • ఇంద్రా రాజ్వ‌ర్‌ను అదుపులోకి తీసుకున్న ఎయిర్‌పోర్టు పోలీసులు

ఓ యువ‌తి త‌న ప్రియుడిని విడిచిపెట్టి ఉండ‌లేక చేసిన ఆక‌తాయి ప‌ని ఆమెను క‌ట‌క‌టాల వెన‌క్కి నెట్టింది. త‌న ప్రేమికుడు విమానం ఎక్క‌కుండా ఆపేందుకు స‌ద‌రు యువ‌తి చేసిన ప‌ని ఇప్పుడు నెట్టింట చ‌ర్చనీయాంశమ‌వుతోంది. వివ‌రాల్లోకి వెళ్తే.. పూణేకు చెందిన ఇంద్రా రాజ్వ‌ర్ (29) అనే యువ‌తి త‌న బాయ్‌ఫ్రెండ్ ప్ర‌యాణాన్ని అడ్డుకోవాల‌నే ఉద్దేశంతో బెంగ‌ళూరులోని కెంపెగౌడ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి బాంబు బెదిరింపు కాల్ చేసింది. 

బెంగళూరు నుంచి ముంబై వెళ్తున్న త‌న‌ ప్రియుడు మీర్ రజా మెహదీ తన లగేజీలో బాంబును పెట్టుకుని ఉన్నాడని రాజ్వ‌ర్ ఎయిర్‌పోర్టు అధికారులకు త‌ప్పుడు స‌మాచారం ఇచ్చింది. ఆమె స‌మాచారంతో వెంట‌నే ఎయిర్‌పోర్టు పోలీసులు మీర్ రజాను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కానీ, అత‌డి వ‌ద్ద ఎలాంటి పేలుడు ప‌దార్థాలు దొర‌క‌లేదు. దాంతో అది బూటకపు బాంబు బెదిరింపు కాల్ అని నిర్ధారించుకున్నారు. 

ఆ తర్వాత ఇంద్రా రాజ్వ‌ర్, మీర్ రజా మెహదీ ఆ సాయంత్రం విమానాశ్రయంలో ఉన్నట్లు గుర్తించారు. ఆ బూటకపు కాల్ చేయడానికి ముందు డిపార్చర్ లాంజ్‌లో ఇద్ద‌రూ మాట్లాడుకోవ‌డం క‌నిపించింది. ఇద్దరూ వేర్వేరు విమానాలలో వేర్వేరుగా ముంబైకి వెళుతున్నారు. ఈ క్ర‌మంలో త‌న ప్రియుడిని ఆపాల‌ని భావించిన ఇంద్రా రాజ్వ‌ర్ అధికారుల‌కు ఫేక్ కాల్ చేసి త‌ప్పుదొవ ప‌ట్టించింది. 

దాంతో రాజ్వ‌ర్‌ను కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌ను విడిచిపెట్టడం ఇష్టం లేక‌నే బూటకపు కాల్ చేసినట్లు అంగీకరించింది. పోలీసులు ఆమెపై ఐపీసీ సెక్షన్ 505(1)(బీ) కింద ఎఫ్ఐఆర్‌ నమోదు చేశారు. ప్ర‌స్తుతం త‌దుప‌రి విచారణ జ‌రుగుతోంది. కాగా, జూన్ 26న ఈ సంఘ‌ట‌న జ‌ర‌గ్గా ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

More Telugu News