Rahul Gandhi: బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్‌కు రాహుల్ గాంధీ లేఖ

Rahul Gandhis Victories Setbacks Note To Rishi Sunak After Poll Loss

  • రిషి ఓటమికి విచారం వ్యక్తం చేస్తూ లేఖ
  • ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, రెండింటినీ హుందాగా స్వీకరించాలని సలహా
  • బ్రిటన్ ప్రజల అభ్యున్నతికి రిషి కట్టుబడి ఉన్నారని ప్రశంస 
  • భారత్‌ - బ్రిటన్ బంధం బలోపేతానికి ఎంతో కృషి చేశారని కితాబు

బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతి మాజీ ప్రధాని రిషి సునాక్ ఓటమి చెందడంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు తప్పవని, రెండింటినీ హుందాగా స్వీకరించాలని సూచించారు. ఈ మేరకు రిషి సునాక్‌కు ఆయన లేఖ రాశారు. బ్రిటన్ ప్రజలకు రిషి సునాక్ గొప్ప సేవ చేశారని కొనియాడారు. బ్రిటన్ ప్రజల అభ్యున్నతికి ఆయన కట్టుబడి ఉన్నారని ప్రశంసించారు. భారత్, బ్రిటన్ సంబంధాలను బలోపేతం చేసేందుకు రిషి సునాక్ చేసిన కృషిని తానెంతో గౌరవిస్తానని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ప్రజల అభ్యున్నతి కోసం రిషి మరింత కాలం పాటుపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రిషి మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. 

ఇటీవల జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ మెజారిటీతో రిషి సునాక్ సారథ్యంలోని కన్జర్వేటివ్ పార్టీపై విజయం సాధించిన విషయం తెలిసిందే. కీర్ స్టార్మర్ సారథ్యంలోని లేబర్ పార్టీ దిగువ సభలో ఏకంగా 412 సీట్లు గెలుచుకుంది. మునుపటితో పోలిస్తే సీట్ల సంఖ్యను రెట్టింపు చేసుకుంది. శుక్రవారం కీర్ స్టార్మర్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. దేశాన్ని పునర్నిర్మిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.

More Telugu News