Anagani Sathya Prasad: చంద్రబాబు చొరవ, రేవంత్ రెడ్డి సానుకూల స్పందన ఫలితమే నేటి సమావేశం: ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్

AP minister Anagani Sathya Prasad press meet

  • హైదరాబాదులో నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం
  • హాజరైన చంద్రబాబు, రేవంత్ రెడ్డి, మంత్రులు
  • సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రులు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో సమావేశమై విభజన అంశాలపై చర్చించడం తెలిసిందే. ఈ సమావేశం ముగిసిన అనంతరం ఉభయ రాష్ట్రాల మంత్రులు మీడియా ముందుకు వచ్చారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడిన అనంతరం, ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాకు వివరాలు తెలిపారు. 

"ఇవాళ తెలుగుజాతి అంతా హర్షించే ఒక మంచి రోజు. ఎందుకంటే... తెలంగాణను పురోగామి పథంలోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు, వారి సహచర మంత్రులు... ఇటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులుగా మేం ఈ సమావేశానికి హాజరై రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు చేసే నిర్ణయాల దిశగా కీలక ముందడుగు వేశాం. 

తెలుగు వారు ఎక్కడున్నా సుభిక్షంగా ఉండాలని కోరుకునే వ్యక్తి చంద్రబాబు గారు. విభజన అంశాల పరిష్కారం కోసం ఆయన చొరవ తీసుకుని ఓ లేఖ పంపడం... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లేఖపై వారి క్యాబినెట్ లో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ఫలితమే నేటి సమావేశం. 

ఈ సమావేశంలో అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించాం. మంత్రులందరి సలహాలు, అధికారుల నుంచి సూచనలు స్వీకరించాం... ఆయా సలహాలు, సూచనలపైనా చర్చించాం. నిధులు, విధులు, కేటాయింపులు... ప్రాతిపదికన తెలంగాణ ఉద్యమం ప్రారంభమై, రాష్ట్రం ఏర్పాటైందన్న సంగతి అందరికీ తెలుసు. అదే సమయంలో ఆంధ్రపదేశ్ అభివృద్ధి, సెంటిమెంట్ ను పరిగణనలోకి తీసుకుని... ఎవరి మనోభావాలు దెబ్బతినని రీతిలో, అందరి భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకుని, ఉభయ రాష్ట్రాల ఆకాంక్షలను నెరవేర్చుకోవాలన్న లక్ష్యంతో నేటి చర్చల సరళి సాగింది. 

పెండింగ్ అంశాల పరిష్కారం చర్చల ద్వారానే సాకారమవుతుందన్న నమ్మకంతోనే అధికారుల కమిటీ వేయడం గానీ, మంత్రుల కమిటీ ఏర్పాటు చేయడం గానీ జరిగింది. పునర్ వ్యవస్థీకరణ చట్టం గురించే కాకుండా, రాబోయే రోజుల్లో కూడా రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండేలా తరచుగా కలుద్దామని ఉభయ ముఖ్యమంత్రులు కూడా నిర్ణయం తీసుకున్నారు. 

భట్టి విక్రమార్క గారు చెప్పినట్టు... తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చే వారి ప్రణాళికతో మేం కూడా సమన్వయం చేసుకుని ముందుకు పోతాం. అందుకోసం రెండు రాష్ట్రాల నుంచి మంత్రులతో ఒక సబ్ కమిటీ వేసుకున్నాం. 

ఏపీలో 8వ తరగతి పిల్లల బ్యాగుల్లో కూడా గంజాయి దొరికే పరిస్థితులు ఉన్నాయి. ఏపీ నుంచే డ్రగ్స్ వస్తున్నాయని తెలంగాణ సీఎం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి... రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరు అడిషనల్ డీజీ అధికారుల నేతృత్వంలో డ్రగ్స్ వ్యతిరేక కార్యాచరణ కొనసాగుతుంది. ఈ ప్రణాళికలకు ఒక టైమ్ ప్లాన్ ఏర్పాటు చేసుకున్నాం. 

మొత్తమ్మీద... పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలకు సరైన పరిష్కారం దిశగా అధికారుల, మంత్రుల కమిటీలు పనిచేస్తాయి. ఈ అంశాలపై మేం మరోసారి సమీక్షించిన తర్వాత అన్ని వివరాలు తెలియజేస్తాం" అని అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.

More Telugu News