Zimbabwe: టీమిండియా 102 ఆలౌట్... జింబాబ్వే సంచలన విజయం

Zimbabwe registers sensational victory over Team India

  • హరారేలో నేడు తొలి టీ20 మ్యాచ్
  • 116 పరుగుల లక్ష్యఛేదనలో చేతులెత్తేసిన టీమిండియా
  • కలసికట్టుగా కదంతొక్కిన జింబాబ్వే బౌలర్లు
  • చెరో మూడు వికెట్లు తీసిన తెందాయ్ చతారా, కెప్టెన్ సికిందర్ రజా

ఐపీఎల్ లో ఆడి రాటుదేలిన ఆటగాళ్లతో కూడిన టీమిండియాకు జింబాబ్వే చేతిలో ఘోర పరాజయం ఎదురైంది. హరారేలో ఇవాళ జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో ఆతిథ్య జింబాబ్వే 13 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. 

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 115 పరుగులు చేసింది. 116 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా అనూహ్యరీతిలో 19.5 ఓవర్లలో 102 పరుగులకే కుప్పకూలింది. 27 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్ చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. 

జింబాబ్వే బౌలర్లలో తెందాయ్ చతారా 3 వికెట్లతో రాణించాడు. కెప్టెన్ సికిందర్ రజా కూడా 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్రయాన్ బెన్నెట్ 1, వెల్లింగ్టన్ మసకద్జా 1, బ్లెస్సింగ్ ముజరబాని 1, ల్యూక్ జోంగ్వే 1 వికెట్ తీశారు. 

టీమిండియా ఇన్నింగ్స్ లో కెప్టెన్ శుభ్ మాన్ గిల్ 31 పరుగులు చేశాడు. ఆఖర్లో అవేశ్ ఖాన్ 16 పరుగులు నమోదు చేశాడు. కెరీర్ లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న ఓపెనర్ అభిషేక్ శర్మ (0 డకౌట్ అయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ 7, రియాన్ పరాగ్ 2, ధ్రువ్ జురెల్ 7 పరుగులు చేశారు. రింకూ సింగ్ (0) పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. 

ఈ విజయంతో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో జింబాబ్వే 1-0తో ముందంజ వేసింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ రేపు (జులై 7) హరారేలోనే జరగనుంది.

More Telugu News