Madhya Pradesh: మధ్యప్రదేశ్ అడవుల్లో వర్షంలో కూనలతో దక్షిణాఫ్రికా చీతా సందడి

Watch Cheetah Gamini Her 5 Cubs Enjoy Rain At Kuno National Park

  • కునో నేషనల్ పార్క్ లో రికార్డయిన వీడియో
  • నెటిజన్లతో పంచుకున్న కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్
  • దేశంలో మొత్తం 26కు చేరిన చీతాలు, కూనల సంఖ్య

దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన గామినీ అనే చీతాతోపాటు దాని ఐదు కూనలు మధ్యప్రదేశ్ అడవుల్లో చిరుజల్లులను ఆస్వాదిస్తూ సందడి చేశాయి. మధ్యప్రదేశ్ లోని షియోపూర్ పరిధిలో ఉన్న కునో నేషనల్ పార్క్ లో తల్లీబిడ్డలు శుక్రవారం సరదాగా ఆడుకోవడం ఓ వీడియో కెమెరాలో రికార్డయింది.

ఈ వీడియోను కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్నారు. ‘ప్రకృతి తీసుకొచ్చే కాలానుగుణ మార్పుల మధ్య అవన్నీ కలిసి ఎప్పటికీ చెరిగిపోని కుటుంబ బాంధవ్యాలను అల్లుకుంటాయి’ అంటూ భూపేందర్ యాదవ్ ఆ వీడియో కింద క్యాప్షన్ ను పోస్ట్ చేశారు.

దక్షిణాఫ్రికాలోని స్వాలు కలహారి రిజర్వ్ ఫారెస్ట్ నుంచి గామిని అనే చీతాను కునో నేషనల్ పార్క్ కు తీసుకొచ్చారు. అది ఈ ఏడాది మార్చిన 10న ఐదు కూనలకు జన్మనిచ్చింది. దీంతో భారత్ లో పుట్టిన చీతా కూనల సంఖ్య 13కు చేరింది. అలాగే కునో నేషనల్ పార్క్ లో ఉన్న చీతాలు, వాటి కూనల సంఖ్య 26కు పెరిగింది. చీతాలు ఒత్తిడిరహిత వాతావరణంలో తిరిగేలా తోడ్పడుతున్న అటవీశాఖ సిబ్బంది, ఫీల్డ్ స్టాఫ్, వెటర్నరీ వైద్యులను కేంద్ర మంత్రి అభినందించారు.

ఈ ఏడాది జనవరిలో మరో ఆఫ్రికా దేశమైన నమీబియా నుంచి కునో నేషనల్ పార్క్ కు తీసుకొచ్చిన జ్వాలా అనే చీతా నాలుగు కూనలకు జన్మనిచ్చింది. వాస్తవానికి 1952లోనే భారతదేశంలో చీతాలు అంతరించిపోయాయి. కానీ 2022లో కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ చీతా పేరుతో నమీబియా నుంచి 8 చీతాలను తీసుకొచ్చింది. అలాగే దక్షిణాఫ్రికా నుంచి 2023 ఫిబ్రవరిలో 12 చీతాలను కూడా తీసుకొచ్చి ఇవే అడవుల్లో ప్రవేశపెట్టింది.

అయితే నమీబియా నుంచి తెచ్చిన చీతాల్లో ఒకటి ఈ ఏడాది జనవరిలో కన్నుమూసింది. మొత్తంగా దేశంలో 2023 నుంచి ఇప్పటివరకు ఏడు పెద్ద చీతాలు, మూడు కూనలు మృత్యువాతపడ్డాయి.

More Telugu News