Manish Sisodia: ఢిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియా కస్టడీ పొడిగింపు
- ఈ నెల 15 వరకు జ్యుడీషియల్ కస్టడీలోనే సిసోడియా
- విచారణను వాయిదా వేసిన రౌస్ అవెన్యూ కోర్టు
- ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో గతేడాది మార్చిలో అరెస్టు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, ఢిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. కస్టడీ గడువు ముగియడంతో శనివారం అధికారులు ఆయనను వర్చువల్ గా కోర్టులో హాజరుపరిచారు. రౌస్ అవెన్యూ కోర్టు ఆయన కస్టడీని మరోమారు పొడిగించింది. ఈ నెల 15 వరకు కస్టడీని పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు.. విచారణను అదేరోజుకు వాయిదా వేసింది. ఈమేరకు శనివారం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీశ్ సిసోడియాను గతేడాది మార్చిలో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి సిసోడియా తీహార్ జైలులో ఉన్నారు. కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు నిందితుల్లో ఒకరైన అరుణ్ పిళ్లై చేసిన అప్పీల్, ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా వాదనలను వాయిదా వేసింది. ఈ నెల 15న మళ్లీ విచారణ జరుపుతామని పేర్కొంది.