Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

Amarnath Yatra temporarily suspended on both routes to the cave shrine on Saturday due to heavy rainfall

  • వర్షాల నేపథ్యంలో అధికారుల నిర్ణయం
  • యాత్రికుల భద్రత దృష్ట్యా అధికారుల ముందస్తు చర్యలు
  • రెండు మార్గాల్లోనూ యాత్ర నిలిపివేత
  • భారీ వర్ష సూచన లేకపోయినా ముందస్తు జాగ్రత్తగా అప్రమత్తమైన అధికారులు

వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు శనివారం ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు మార్గాల్లోనూ యాత్రను నిలిపివేసినట్టు స్పష్టం చేశారు. బాల్తాల్, పహల్గాం మార్గాల్లో గత రాత్రి నుంచి వర్షాలు కురుస్తుండడంతో యాత్రికుల భద్రత నిమిత్తం ఈ చర్య తీసుకున్నట్లు వివరించారు.

ఇవాళ (శనివారం) భారీ వర్షాలు పడే అవకాశం లేదని, అయితే అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో అప్రమత్తతలో భాగంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అమర్‌నాథ్ ఆలయ గుహ, శేషనాగ్ శిఖరం వద్ద ఉష్ణోగ్రత గరిష్ఠంగా 15 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని, ఇక రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక రాగల 4 రోజులలో పెద్ద వర్షపాతం ఉండదని, అయితే ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. 

కాగా 3,800 మీటర్ల ఎత్తులో సహజసిద్ధంగా ఏర్పడిన మంచు లింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు ఈ ఏడాది కూడా పోటెత్తుతున్నారు. ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభమవగా ఇప్పటివరకు 1.50 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని అంచనాగా ఉంది. ఇక ఆగస్టు 19న యాత్ర ముగుస్తుంది. కాగా గతేడాది మొత్తం 4.5 లక్షల మంది యాత్రికులు శివలింగాన్ని దర్శించుకున్నారు.

More Telugu News