Crisil Report: శాకాహార భోజ‌నం ధ‌ర‌లు 10 శాతం పెరిగాయ్‌: క్రిసిల్ నివేదిక‌

Crisil Report says Veg Thali Gets Dearer By 10 percent In June

  • క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనాలిసిస్ నెలవారీ 'రోటీ రైస్ రేట్' నివేదిక 
  • జూన్‌లో 10 శాతం పెరిగిన శాకాహార భోజ‌నం స‌గ‌టు ధ‌ర
  • 2023 జూన్‌లో రూ. 26.70గా ఉంటే.. ఈ ఏడాది జూన్‌లో రూ. 29.40కు పెరిగిన వైనం
  • ఉల్లి, ట‌మాటా, బంగాళ‌దుంప‌లు, బియ్యం, ప‌ప్పుల ధ‌ర‌లు పెర‌గ‌డ‌మే కార‌ణమ‌న్న‌ నివేదిక 
  • చికెన్‌ ధర తగ్గడం మాంసాహార భోజనం ధర తగ్గడానికి దోహదపడిందన్న రిపోర్టు

శాకాహార భోజ‌నం స‌గ‌టు ధ‌ర జూన్‌లో 10 శాతం పెరిగిన‌ట్లు శుక్ర‌వారం క్రిసిల్ వెల్ల‌డించిన త‌న నివేదిక‌లో పేర్కొంది. అయితే, క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనాలిసిస్ నెలవారీ 'రోటీ రైస్ రేట్' నివేదిక ప్రకారం చికెన్‌ ధర తగ్గడం మాంసాహార భోజనం ధర తగ్గడానికి దోహదపడిందని తెలిపింది.

వెజ్ థాలీ ప్లేట్ స‌గ‌టు ధ‌ర 2023 జూన్‌లో రూ. 26.70 కాగా, ఈ ఏడాది జూన్‌లో రూ. 29.40కు పెరిగింది. 2024 మేలో ఇది రూ. 27.80గా ఉంది. ఉల్లి, ట‌మాటా, బంగాళ‌దుంప‌లు, బియ్యం, ప‌ప్పుల ధ‌ర‌లు పెర‌గ‌డ‌మే కార‌ణంగా నివేదిక పేర్కొంది. 

ఇక‌ శాకాహారం థాలీ ధరలు పెరగడానికి టమోటా ధరలు 30 శాతం, బంగాళదుంపలు 59 శాతం, ఉల్లి 46 శాతం పెరగడం కారణంగా నివేదిక తెలిపింది. రబీ విస్తీర్ణం గణనీయంగా తగ్గడంతో ఉల్లి దిగుబ‌డి ప‌డిపోయింది. మార్చిలో అకాల వర్షాల కారణంగా బంగాళదుంపలు తక్కువ దిగుబడిని సాధించిన‌ట్లు క్రిసిల్‌ రిపోర్టు పేర్కొంది. 

కాగా, కర్ణాట‌క‌, ఏపీలోని కీలకమైన ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వేసవి పంటలో వైరస్ సోకడం వల్ల ఏడాదికి 35 శాతం టమోటా దిగుబ‌డి తగ్గింది. ఇది టమోటా ధరల పెరుగుదలకు కార‌ణ‌మైంద‌ని నివేదిక వెల్ల‌డించింది. అటు వ‌రిసాగు త‌గ్గ‌డంతో బియ్యం ధరలలో 13 శాతం పెరుగుదల న‌మోదైనట్లు తెలిపింది. అలాగే ఖరీఫ్ సీజ‌న్‌లో సరిగా వ‌ర్షాలు లేక‌పోవ‌డంతో పప్పుల ధరలు 22 శాతం పెరిగాయని నివేదిక పేర్కొంది.

ఇటు చికెన్ రేటు 14 శాతం త‌గ్గ‌డంతో నాన్ వెజ్ థాలీ ఈ జూన్‌లో రూ. 58కి దిగివ‌చ్చింది. గ‌తేడాది జూన్‌లో ఇది రూ. 60.50గా ఉంది. అయితే, ఈ ఏడాది మే నెల‌లో ఇది కేవ‌లం రూ. 55.90గా ఉంది.

  • Loading...

More Telugu News