BSP: తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య.. ఫుడ్ డెలివరీ ఏజెంట్స్‌గా వచ్చి దాడి!

BSP Tamil Nadu Chief Armstrong Hacked To Death By 6 Men On Bikes In Chennai

  • నివాసానికి సమీపంలోనే కత్తులతో నరికి చంపేసిన ఆరుగురు వ్యక్తులు
  • బైక్‌పై వచ్చి దాడి.. పరారీ
  • ప్రతీకార హత్య కావొచ్చని పోలీసుల అనుమానాలు

తమిళనాడు రాజధాని చెన్నైలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్ దారుణ హత్యకు గురయ్యారు. సిటీలోని సెంబియం ప్రాంతంలో ఉన్న తన నివాసానికి సమీపంలో కొంతమంది పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతుండగా బైకులపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. తీవ్ర గాయాలపాలైన ఆర్మ్‌‌స్ట్రాంగ్‌ను కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. 

కాగా ఈ హత్యపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇది ప్రతీకార హత్య కావొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ హత్య గతంలో జరిగిన మర్డర్ మాదిరిగా ఉందని, గతేడాది జరిగిన ఆర్కోట్ సురేశ్ అనే గ్యాంగ్‌స్టర్ హత్యతో సంబంధం ఉండొచ్చని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. నిందితులు ఫుడ్ డెలివరీ ఏజెంట్ల మాదిరిగా వచ్చినట్టు తెలుస్తోందని, అయితే ఈ విషయాన్ని నిర్ధారించుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.

ఈ ఘటనను బీఎస్పీ చీఫ్ మాయావతి ఖండించారు. ఆర్మ్‌స్ట్రాంగ్‌ దళితుల బలమైన గొంతుక అని, అతడిని హత్య చేసిన దోషులను శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె స్పందించారు. ఈ హత్య నేపథ్యంలో అధికార డీఎంకేపై ప్రతిపక్ష ఏఐఏడీఎంకే విరుచుకుపడింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, ఈ హత్యే అందుకు నిదర్శనమని తీవ్రంగా విమర్శించింది. ఒక జాతీయ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధినేత హత్యకు గురయ్యాక ఇంకేం మాట్లాడగలమని, రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితి సిగ్గుచేటని ప్రతిపక్ష ఏఐఏడీఎంకే నేత పళనిస్వామి తీవ్రంగా విమర్శించారు. 

కాగా ఆర్మ్‌స్ట్రాంగ్ న్యాయవాదిగా కూడా పనిచేస్తున్నారు. 2006లో చెన్నై కార్పొరేషన్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. రెండేళ్ల క్రితం చెన్నైలో మెగా ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీకి బీఎస్పీ అధినేత్రి మాయావతిని ఆహ్వానించారు. ఈ ర్యాలీ తర్వాత ఆయన గుర్తింపు మరింత పెరిగింది.

  • Loading...

More Telugu News