Jasprit Bumrah: రిటైర్మెంట్‌పై జస్ప్రీత్ బుమ్రా కీల‌క వ్యాఖ్య‌లు!

Jasprit Bumrah big statement on retirement during Team India felicitation ceremony at Wankhede Stadiu

  • వాంఖ‌డేలో స‌న్మాన కార్య‌క్ర‌మంలో ప్రేక్ష‌కుల‌ను ఉద్దేశించి మాట్లాడిన‌ బుమ్రా
  • ఈ క్ర‌మంలో బుమ్రాకు టీ20ల నుంచి రిటైర్మెంట్‌పై ప్ర‌శ్న
  • త‌న కెరీర్ ఇప్పుడే మొద‌లైంద‌ని.. ఇప్ప‌ట్లో రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌న‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌
  • దానికి ఇంకా చాలా స‌మ‌యం ఉందంటూ వ్యాఖ్య‌

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌తో స్వ‌దేశానికి చేరుకున్న భార‌త క్రికెట‌ర్ల‌కు ఘ‌న స్వాగ‌తం ద‌క్కింది. అభిమానులు టీమిండియాకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. విక్ట‌రీ ప‌రేడ్‌కు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చిన అభిమానులు.. ఆట‌గాళ్ల‌కు స‌న్మానం ఏర్పాటు చేసిన వాంఖ‌డే స్టేడియంలో కూడా కిక్కిరిసిపోయారు. 

ఇక జ‌న‌సందోహం మ‌ధ్య కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, కోచ్ రాహుల్ ద్ర‌విడ్‌, విరాట్ కోహ్లీ, జ‌స్ప్రీత్ బుమ్రా త‌మ టీ20 వర‌ల్డ్‌క‌ప్ విక్ట‌రీ జ‌ర్నీని అభిమానుల‌తో పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా టోర్నీ ఆసాంతం అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుని ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్‌గా నిలిచిన బుమ్రా ప్రేక్ష‌కుల‌ను ఉద్దేశించి మాట్లాడాడు. టోర్నీలో భార‌త్ విజేత‌గా నిల‌వ‌డంలో త‌నవంతు పాత్ర పోషించినందుకు ఆనందంగా ఉంద‌న్నాడు. త‌మ కోసం ఇంత‌మంది త‌ర‌లిరావ‌డం జీవితంలో మ‌రిచిపోలేన‌ని బుమ్రా ఉద్వేగానికి లోన‌య్యాడు. ఈ ఆనందం మాట‌ల్లో చెప్ప‌లేనిద‌న్నాడు. 

తాను అండ‌ర్‌-19 క్రికెట్ ఆడిన‌ప్పుడు వాంఖ‌డేకి వ‌చ్చాన‌ని, ఆ త‌ర్వాత చాలాసార్లు ఈ మైదానానికి వ‌చ్చినా.. ఈరోజు ఎంతో అద్భుతంగా అనిపిస్తుంద‌ని తెలిపాడు. ఫైన‌ల్ మ్యాచ్ అనంత‌రం తాను కూడా భావోద్వేగానికి గురైన‌ట్లు తెలిపాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వంటి అనుభవజ్ఞుల‌తో క‌లిసి ఆడ‌డం త‌న అదృష్టంగా పేర్కొన్నాడు. 

ఈ ముగ్గురు దిగ్గ‌జాలు టీ20ల రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడమే త‌మ‌ లక్ష్యం అని చెప్పాడు. తాము ఇంతకు ముందు ప్రపంచకప్ గెలవలేద‌ని. ఇది త‌మ‌కు మరింత ప్రేరణనిస్తుందని బుమ్రా చెప్పుకొచ్చాడు.  

ఈ క్ర‌మంలో బుమ్రాకు టీ20ల నుంచి రిటైర్మెంట్‌పై ప్ర‌శ్న ఎదురైంది. దీనికి స‌మాధానం ఇస్తూ.. త‌న కెరీర్ ఇప్పుడే మొద‌లైంద‌ని, ఇప్ప‌ట్లో రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌న‌ని తెలిపాడు. దానికి ఇంకా చాలా స‌మ‌యం ఉంద‌న్నాడు. తాను ఇంకా చాలా క్రికెట్ ఆడాల్సి ఉంద‌ని పేర్కొన్నాడు. 

ఇక టోర్నీలో అతని మ్యాచ్ విన్నింగ్ స్పెల్‌లు టీమిండియా రెండో టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను సాధించడంలో కీలకపాత్ర పోషించాయన‌డంలో ఎలాంటి సందేహం లేదు. టోర్నీ మొత్తం బుమ్రా త‌న ప‌దునైన బంతుల‌తో ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల బ్యాట‌ర్ల‌ను బెంబెలేత్తించాడు. కేవలం 8.26 సగటు, 4.17 ఎకానమీ రేటుతో 15 వికెట్లు పడగొట్టి ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. 

ప్ర‌ధానంగా ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చివరి 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన స్థితిలో బుమ్రా చేసిన మ్యాజిక్‌ను ఇండియ‌న్ ఫ్యాన్స్ ఎప్ప‌టికీ మ‌రిచిపోలేరు. చివ‌రి ఐదు ఓవ‌ర్ల‌లో రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా ఆరు ర‌న్స్‌ మాత్రమే ఇచ్చి ఒక కీలకమైన వికెట్ తీయ‌డంతో మ్యాచ్ మొత్తం టీమిండియా గుప్పిట్లోకి వ‌చ్చేసింది. అత‌నికి తోడు అర్ష్‌దీప్‌, పాండ్యా కూడా అద్భుతంగా బౌలింగ్ చేయ‌డంతో భార‌త్ విజేత‌గా అవ‌త‌రించింది.

More Telugu News