Chennupati Gandhi: వైసీపీ నేత ఈశ్వర్ ప్రసాద్ అరెస్ట్.. రిమాండును తిరస్కరించిన న్యాయమూర్తి

YCP leader Eshwar Prasad arrested and released

  • రెండేళ్ల క్రితం చెన్నుపాటి గాంధీపై వైసీపీ నేతల దాడి
  • అప్పట్లో ఈశ్వర్ ప్రసాద్‌ను ఏ3 నిందితుడిగా చేర్చి, ఆపై తొలగింపు
  • తాజాగా ఏ5గా పేర్కొంటూ 307 సెక్షన్ జోడింపు
  • ఏ5 నిందితుడికి హత్యాయత్నం సెక్షన్ జోడించడం కుదరదంటూ రిమాండ్ తిరస్కరించిన జడ్జి 

టీడీపీ నేత చెన్నుపాటి గాంధీపై రెండేళ్ల క్రితం జరిగిన దాడికేసులో వైసీపీ నేత దేవినేని అవినాశ్ అనుచరుడు ఈశ్వర్ ప్రసాద్‌ను నిన్న విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌ ఇచ్చేందుకు జడ్జి తిరస్కరించారు. 

3 సెప్టెంబర్ 2022న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పటమటలంకలోని కొమ్మా సీతారావమ్మ జడ్పీ ఉన్నత పాఠశాల రోడ్డులో జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ పనులను గాంధీ పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న వైసీపీ నేతలు గద్దె కల్యాణ్, సుబ్బు లీలాప్రసాద్, వల్లూరి ఈశ్వర్‌ప్రసాద్ తదితరులు గాంధీని ఆపి తమ ప్రభుత్వంలో నీ పెత్తనం ఏంటని ప్రశ్నించారు. అది క్రమంగా గొడవగా మారడంతో పదునైన ఆయుధంతో వారు ఈశ్వర్ ప్రసాద్‌పై దాడిచేయడంతో ఆయన కుడికన్నుకు గాయమైంది. 

ఈ ఘటనపై పోలీసులు అప్పట్లో 326, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పట్లో నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టినప్పటికీ గాంధీకి అయిన గాయానికి సంబంధించి నివేదికను పోలీసులు కోర్టుకు సమర్పించకపోవడంతో రిమాండ్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అంతేకాదు, అప్పట్లో గద్దె కల్యాణ్, లీలాప్రసాద్‌ను మాత్రమే నిందితులుగా చూపించి ఈశ్వర్ ప్రసాద్‌ను వదిలేశారు. మరోవైపు, తనపై జరిగిన దాడిలో ఈశ్వర్ ప్రసాద్ కూడా ఉన్నారని గాంధీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

రెండేళ్లుగా మూలన ఉన్న ఈ కేసులో తాజాగా కదలిక మొదలైంది. అప్పట్లో ఎఫ్ఐఆర్‌లో ఈశ్వర్ ప్రసాద్‌ను ఏ3గా చేర్చి, ఆ తర్వాత తొలగించారు. ఇప్పుడు ఈశ్వర్ ప్రసాద్‌ను ఏ5గా చేర్చి 307 సెక్షన్‌ను జోడించారు. ఈ నేపథ్యంలో నిన్న ఈశ్వర్ ప్రసాద్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఇన్‌చార్జ్ కోర్టు అయిన 3వ ఏసీఎంఎం న్యాయస్థానంలో హాజరుపరిచారు. గతంలో 326 సెక్షన్ నమోదు చేసి, ఇప్పుడు ఏ5 నిందితుడికి హత్యాయత్నం జోడించడం కుదరదని పేర్కొన్న న్యాయమూర్తి తిరుమలరావు నిందితుడిని వదిలిపెట్టాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News