Dwarampudi Chandrasekhar Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై కేసు
- అక్రమకట్టడం కూల్చివేత ఘటనలో తమ విధులకు అడ్డుపడ్డారంటూ అధికారుల ఫిర్యాదు
- అనుచరులను రెచ్చగొట్టి గొడవకు దిగేలా చేశారని మాజీ ఎమ్మెల్యేపై ఆరోపణ
- ఏ1 ద్వారంపూడి, ఏ2గా అనుచరుడు బళ్ల సూరిబాబును చేరుస్తూ కేసు నమోదు
వైసీపీ నేత, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఆయన ప్రధాన అనుచరుడు బళ్ల సూరిబాబుతో పాటు మరో 24 మందిపైనా కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో గురువారం కేసు నమోదు చేశారు.
ఈ నెల 2న కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని రాజ్యలక్ష్మినగర్‌లో వైసీపీ నాయకుడు సూరిబాబుకు చెందిన అక్రమ కట్టడం కూల్చివేత ఘటనలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారని అధికారులు ఫిర్యాదు చేశారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన అనుచరులతో వచ్చి గొడవకు దిగారని, రెచ్చగొట్టేలా వ్యవహరించారని పేర్కొన్నారు. ద్వారంపూడి ప్రోద్బలంతో వైసీపీ కార్యకర్తలు మున్సిపల్ అధికారులు, సిబ్బందిపై దాడులకు దిగారని ఫిర్యాదు చేశారు. ఏ1గా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఏ2గా బళ్ల సూరిబాబు, మరో 24 మందిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నాగేశ్వర్ నాయక్ తెలిపారు.