New Delhi: హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రేకులు ఫెయిలవడంతో పలు వాహనాలను ఢీకొట్టిన స్కూల్ బస్
![On Camera School Bus Crashes Into Several Vehicles Rams Car Under Truck](https://imgd.ap7am.com/thumbnail/cr-20240705tn66874def1f8ee.jpg)
హర్యానాలోని హిసార్ జిల్లాలో ఈ ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 40 మంది స్కూలు పిల్లలతో వెళుతున్న ఓ బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. చివరకు ఓ భారీ ట్రక్కును ఢీకొని నిలిచిపోయింది. భారీ వర్షాల నేపథ్యంలో 9వ జాతీయ రహదారిపై వ్యాన్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వాహనాన్ని డ్రైవర్ అదుపు చేయలేకపోవడంతో బైక్ సహా పలు వాహనాలను ఢీకొట్టాడు. వెంటనే రంగంలోకి దిగిన స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ద్విచక్రవాహనదారుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
స్కూలు బస్సు.. ఓ కారును కూడా ఢీకొట్టడంతో అది వెళ్లి ఓ భారీ ట్రక్కును ఢీకొంది. అయితే, ట్రక్కు అప్పటికే నెమ్మదిగా వెళుతుండగా కారులోని ఇద్దరు మహిళలు సులువుగా బయటకు రాగలిగారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో చిన్నారులు ఎవరికీ ఎటువంటి గాయాలూ కాలేదు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.