Team India: భారత క్రికెటర్లకు మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి ఆహ్వానం
- అసెంబ్లీకి వెళ్లి సీఎం ఏక్‌నాథ్ షిండేను కలవనున్న ఆ రాష్ట్రానికి చెందిన రోహిత్, సూర్య, దూబే, యశస్వీ
- జట్టు సభ్యులందరికీ శుక్రవారం విధాన్ భవన్‌లో సన్మానం
- టీమిండియాకు అభినందనలు తెలుపుతూ మహారాష్ట్ర ఉభయ సభలు ఇప్పటికే తీర్మానాలు
టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత క్రికెటర్లకు మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి ఆహ్వానం అందింది. ఆ రాష్ట్రానికి చెందిన కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, యశస్వీ జైస్వాల్ అసెంబ్లీకి వెళ్లి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను కలవనున్నారు.
రోహిత్, సూర్య, దూబే, జైస్వాల్ సహా ఇతర జట్టు సభ్యులను శుక్రవారం విధాన్ భవన్‌లో సన్మానించనున్నారు. శివసేన శాసనసభ్యుడు ప్రతాప్ సర్నాయక్ చేసిన ప్రతిపాదనపై స్పీకర్ రాహుల్ నార్వేకర్ స్పందిస్తూ, "ఈ ఆటగాళ్లకు ఆహ్వానాలు వెళ్లాయి. వారు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను కూడా కలుస్తారు" అని అన్నారు.
ఇక ఐసీసీ ప్రపంచకప్ గెలుచుకున్న భారత క్రికెట్ జట్టుకు అభినందనలు తెలుపుతూ మహారాష్ట్ర ఉభయ సభలు ఇప్పటికే తీర్మానాలు చేశాయి. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్ల సన్మాన కార్యక్రమానికి శాసనసభ్యులందరూ హాజరయ్యేలా చూడాల్సిందిగా స్పీకర్‌ను అభ్యర్థించనున్నట్లు సర్నాయక్ తెలిపారు.
రోహిత్ శర్మ, సూర్యకుమార్, శివం దూబే, యశస్వి జైస్వాల్ ముంబైకి చెందిన వారని, ఇది ముంబైవాసులకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. 2007, 2011 ప్రపంచకప్‌లు గెలిచినప్పుడు అప్పటి టీమిండియా ప్లేయర్లను ఎలాగైతే సన్మానించారో.. ఇప్పుడు ఈ ఆటగాళ్లను కూడా అదే మాదిరి గౌరవించాలని సర్నాయక్ అన్నారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఈ ఆటగాళ్లను వారి అద్భుతమైన ప్రదర్శనకు గౌరవించాలని చెప్పుకొచ్చారు.