Vande Bharat Express: వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో నీటి లీకేజీ.. వీడియో వైరల్

water leakage in delhi varanasi vande bharat train

  • ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లే రైల్లో ఘటన
  • నీటి లీకేజీతో కింద ఉన్న సీట్లు తడిసిన వైనం
  • ప్రయాణికుల మండిపాటు.. స్పందించిన ఉత్తర రైల్వే
  • ఏసీ పైపుల్లో తాత్కాలిక అడ్డంకి వల్లే నీరు లీక్ అయినట్లు వెల్లడి
  • తమ సిబ్బంది వెంటనే దాన్ని సరిచేశారని ‘ఎక్స్’లో వివరణ

సాధారణంగా రైలు ప్రయాణం అంటే అందరికీ ఆహ్లాదం పంచుతుంది. అందులోనూ వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణమంటే మరింత సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తారు. కానీ తాజాగా ఢిల్లీ, వారణాసి మధ్య నడిచే 22416 నంబర్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో ఓ మహిళా ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎదురైంది. 

ఆమె కూర్చున్న సీటు పైన రూఫ్ నుంచి నీరు ధారగా కారింది. దీనివల్ల కింద ఉన్న కొన్ని సీట్లు తడిసిపోయాయి. దీన్ని చూసిన తోటి ప్రయాణికులంతా అవాక్కయ్యారు. 

రైలు రూఫ్ నుంచి నీరు కారుతున్న దృశ్యాన్ని ఆ మహిళా ప్రయాణికురాలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది.

ఆ వీడియోలో ఆ మహిళ ‘మీ కాలేజీలో అందరికీ చెప్పు. ఇక ఎవరూ ప్రయాణించకూడదు’ అంటూ మాట్లాడటం వినిపించింది. తాను పోస్ట్ చేసిన వీడియోకు జతగా ఆమె ఓ క్యాప్షన్ ను జత చేశారు. ‘వందేభారత్ రైలు దుస్థితి చూడండి. ఈ రైలు ఢిల్లీ–వారణాసి మార్గంలో నడుస్తుంది’ అని క్యాప్షన్ గా రాసుకొచ్చారు. ఈ నెల 2న ఆమె వీడియోను పోస్ట్ చేయగా 50 వేలకుపైగా వ్యూస్ వచ్చాయి.

దీన్ని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ‘మీరు టికెట్ కు పూర్తి డబ్బులు చెల్లిస్తే రైల్వే శాఖ మీకు ఏసీ సదుపాయంతోపాటు జలపాతం అనుభూతి కూడా కల్పిస్తుంది’ అంటూ ఓ యూజర్ సెటైర్ వేశాడు.

మరోవైపు ఈ వీడియో వైరల్ కావడంతో ఉత్తర రైల్వే అధికారిక ‘ఎక్స్’ హ్యాండిల్ స్పందించింది. ‘ఏసీ పైపుల్లో తాత్కాలికంగా అడ్డంకి ఏర్పడటంతో స్వల్ప లీకేజీ సంభవించింది. ఈ విషయం తెలిసిన వెంటనే సిబ్బంది దాన్ని సరిచేశారు. అయినా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం’ అని ఉత్తర రైల్వే బదులిచ్చింది.

Vande Bharat Express
Delhi-Varanasi Route
Water Leakage
AC Vent
Passengers Angry
Social Media
React

More Telugu News