Snake: తల తెగి పడినా తన మొండాన్నే కాటేసిన పాము! ఇదిగో వీడియో

How is this possible Snake Bites Its Headless Body After Death Netizens React Video

  • నెట్టింట వీడియో క్లిప్ వైరల్
  • దానికి ఏకంగా 18 మిలియన్ల వ్యూస్
  • ఇదెలా సాధ్యమని అవాక్కవుతున్న నెటిజన్లు
  • దాని వెనకున్న సైన్స్ కోణాన్ని వివరించిన నిపుణులు

ఆహారం దొరక్కపోతే కొన్ని పాములు తమ గుడ్లను తామే తింటాయన్న సంగతి తెలిసిందే. కానీ తల తెగి పడినా తన మొండాన్నే పాము కాటేయడం గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది నమ్మశక్యంగా లేదనిపిస్తోందా? అయితే నెట్టింట హల్ చల్ చేస్తున్న ఓ వీడియో క్లిప్ లో ఇదే సన్నివేశం కనిపించింది. ఈ వీడియోకు ఏకంగా 18 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

ఆ వీడియోలో కాపర్ హెడ్ రకానికి చెందిన ఓ పాము తల తెగిపడి కనిపించింది. దీంతో దాని మొండెం గిలగిలా కొట్టుకుంటుండగా తల మాత్రం పక్కన చలనం లేకుండా పడి ఉంది. కానీ ఎప్పుడైతే పాము తోక భాగం తలను తాకిందో అప్పుడు వెంటనే పాము తల ఒక్కసారిగా నోరుతెరిచింది. రెప్పపాటులో తోక భాగాన్ని కాటు వేసింది. నోటితో అలా కరిచిపెట్టుకొనే ఉంది. 

దీన్ని చూసిన నెటిజన్లు అవాక్కయ్యారు. ఇదేం విచిత్ర ప్రవర్తన అని ఆశ్చర్యపోయారు. ‘పాము తల దాని శరీరానికి అతుక్కొని లేకపోయినా అది నొప్పిని ఎలా అనుభవిస్తోంది?’ అని ఓ యూజర్ ప్రశ్నించాడు. మరో నెటిజన్ ఏమో ‘ఇదెలా సాధ్యం?’ అని ప్రశ్నించాడు.  ఇంకొకరు దీన్ని స్వీయ విధ్వంసంగా అభివర్ణించగా మరొకరు దీన్ని బ్లూటూత్ నొప్పేమో అంటూ చమత్కరించాడు.

ఈ విచిత్ర ఘటన వెనక కారణాన్ని అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్న స్మిత్ సోనియన్స్ నేషనల్ జూ చీఫ్ జేమ్స్ మర్ఫీ నేషనల్ జియోగ్రఫిక్ కు వివరించారు. ‘పాము తన తలను కోల్పోయే సమయానికి అది చనిపోయి ఉంటుంది. దాని శరీరంలోని మౌలిక పనితీరు పూర్తిగా నిలిచిపోతుంది. అయినప్పటికీ పాము శరీరంలో ఇంకా అసంకల్పిత చర్యలు కొనసాగుతాయి. తల తెగినా పాము కాటేయగలదు.. విషాన్ని చొప్పించగలదు’ అని మర్ఫీ చెప్పారు.

అలాగే ఈ అంశంపై యూనివర్సిటీ ఆఫ్ ఆర్కాన్సస్ కు చెందిన బయోలజీ ప్రొఫెసర్ స్టీవెన్ బీపర్ ఓ వెబ్ సైట్ తో మాట్లాడారు. ‘పాములు మరణించినా అసంకల్పిత చర్యలకు అవి పెట్టింది పేరు. పాము చనిపోయిన కొన్ని గంటల వరకు దాని శరీర నరాల్లో అయాన్లు ఉంటాయి. ఆ నరాలను ప్రేరేపిస్తే అందులోని అయాన్ చానళ్లు తెరుచుకొని వాటి గుండా విద్యుత్ ప్రవాహాలను ప్రసంరింపజేస్తాయి. దీంతో పాము తల కాటేయడం లాంటి అసంకల్పిత చర్యలకు దారితీస్తుంది’ అని బీపర్ వివరించారు.

  • Loading...

More Telugu News