YS Sharmila: రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలు దహనం చేయడంపై మండిపడుతూ షర్మిల ట్వీట్

AP Congress Chief YS Sharmila Tweet On Modi

  • దిష్టిబొమ్మలే కాదు గోద్రా, మణిపూర్ లను తగలబెట్టించిన చరిత్ర మోదీదని తీవ్ర వ్యాఖ్యలు
  • ఆకాశం మీద ఉమ్మితే మీ మీదే పడుతుందంటూ హెచ్చరిక
  • మణిపూర్ తగలబడుతుంటే అక్కడ పర్యటించే ధైర్యంలేని మీరా దేశానికి మంచిచేసేదంటూ నిలదీసిన షర్మిల

‘దేశ ప్రజల ఐక్యత, సోదరభావం, ప్రేమ, శాంతి సందేశంతో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఘనత రాహుల్ గాంధీది.. అలాంటి వ్యక్తి దిష్టిబొమ్మలు కాల్పించడం బీజేపీ నీచ సంస్కృతికి నిదర్శనం’ అంటూ కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. ఆకాశం మీద ఉమ్మితే అది మీ మీదే పడుతుందని బీజేపీ నేతలను హెచ్చరించారు. "ఝూట్ బోలో, బార్ బార్ ఝూట్ బోలో" అంటూ పార్లమెంట్ ను అబద్దాల కార్ఖానాగా నడుపుతున్నారని మండిపడ్డారు. దేశ ప్రజలను పదే పదే మభ్యపెడుతూ, సంస్కారం, విచక్షణ కోల్పోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు సాక్షిగా ఫాసిస్టు పాలన నడుపుతున్నారంటూ నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు.

వీరోచిత పోరాటపటిమ, అద్భుత వాగ్ధాటి, మనసా వాచా కర్మణా దేశం, ప్రజల కోసమే నిలబడే నిస్వార్థ చింతన వంటి గొప్ప లక్షణాలు ఉన్న రాహుల్ గాంధీని అవమానించడం ద్వారా ఏం సాధించాలని అనుకుంటున్నారని మోదీని ప్రశ్నించారు. ‘మీ నీచ రాజకీయాలు, మోసపూరిత చర్యలు, ప్రజల గుండెల్లో విషం నింపే కుట్రలను యావత్ దేశం గమనిస్తోంది. మీ మాయమాటలకు మోసపోయేంత అమాయకులు కారు ప్రజలు. మణిపూర్ తగలబడుతూ ప్రజల భవిత సర్వనాశనం అవుతుంటే అక్కడ పర్యటించలేని పిరికి ప్రభుత్వం మీది. మీరా దేశానికి మంచి చేసేది? మీరా రాజ్యాంగం గురించి మాట్లాడేది?’ అని నిలదీశారు. దిష్టి బొమ్మలే కాదు, గోద్రా, మణిపూర్ లను కూడా తగలబెట్టించిన నైజం మోదీదని వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు.

More Telugu News