Congress Tweet: పదేళ్ల కేసీఆర్ పాలనలో ఇలాంటివి ఎప్పుడైనా చూశామా? అంటూ కాంగ్రెస్ ట్వీట్

Congress Party Intresting Tweet On KCR Ten Years Rule

  • అద్దాల మేడలు చూపించి అభివృద్ధి అంటే ఇదేనని నమ్మించారంటూ ఫైర్
  • ఒక్కసారి కూడా హోటల్స్ లో అధికారులు తనిఖీలు చేయలేదని విమర్శలు
  • ఏం తింటున్నాం.. ఏం తాగుతున్నామో తెలియలేదంటూ ట్వీట్

పదేళ్ల కేసీఆర్ పాలనలో అద్దాల మేడలు, ఆకాశహర్మ్యాలను చూపించి అభివృద్ధి అంటే ఇదేనని చెబితే నమ్మి సంబరపడ్డాం.. కానీ ఏ రోజూ హోటళ్లలో మనం ఏం తింటున్నాం, ఏం తాగుతున్నామనేది చూపించలేదని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. పదేళ్లలో ఏ రోజూ ఏ ఒక్క హోటల్ లోనూ తనిఖీలు చేయించిన పాపాన పోలేదని ట్వీట్ చేసింది. హైదరాబాద్ లో కోటికి పైగా ఉన్న జనాభాలో ఎక్కువ మంది మధ్య తరగతి ప్రజలేనని గుర్తుచేసింది. తెల్లారిలేస్తే ఉరుకులు పరుగులతో జీవనం గడిపే మధ్య తరగతి ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో తిండి కోసం హోటళ్లను ఆశ్రయిస్తారని పేర్కొంది. 

అయితే, హోటళ్లలో మనం తినే తిండి శుభ్రమైనదేనా? హోటళ్లు, రెస్టారెంట్లు శుచి, శుభ్రత, భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నాయా? అనేది తెలియకుండా పోయిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. పదేళ్లు ఒక్క రెస్టారెంట్ మీద కానీ ఒక్క హోటల్, మెడికల్ షాప్ మీద కానీ ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఇన్ స్పెక్షన్ చేయడం చూశామా? అని ప్రశ్నించింది. గడిచిన ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో హోటళ్లలో తనిఖీలు చేస్తే ఎలాంటి దారుణాలు బయటపడ్డాయో మీడియాలో చూశామని, అలాంటి తిండి తినడం వల్ల మన ఆరోగ్య పరిస్థితి ఏమైపోతుందని ఆవేదన వ్యక్తం చేసింది.

కాంగ్రెస్ పాలనలో గడచిన ఆరు నెలల్లో వారానికి సగటున రెండు మూడు వార్తలు ఫుడ్ సేఫ్టీ, మెడికల్ ఇన్ స్పెక్షన్ల గురించి వింటున్నామని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఇలా దాడులు చేయడం వల్ల అంతా అయిపోతుందని కాదు కానీ కనీసం ప్రభుత్వ వ్యవస్థలు పనిచేస్తున్నాయనే నమ్మకం కలుగుతుందని, హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉందని ట్వీట్ లో పేర్కొంది. అంబేద్కర్ చెప్పినట్లు.. ‘‘అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. ప్రజలు స్వేచ్ఛగా, హాయిగా, నాణ్యమైన జీవన ప్రమాణాలతో బతికే పరిస్థితి’’ అని గుర్తుచేసింది. హైదరాబాద్ లో ఉంటున్న ప్రతీ ఒక్కరూ ఆలోచించాలంటూ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ లో పేర్కొంది.

  • Loading...

More Telugu News