Mohammed Rizwan: ‘ఇస్లాంకు బ్రాండ్ అంబాసిడర్’నన్న పాక్ క్రికెటర్ రిజ్వాన్.. మండిపడ్డ మాజీ ఆటగాడు

Pakistan Star Slams Mohammad Rizwan Over Brand Ambassador Of Islam Remark

  • ఫిట్ నెస్ లేకపోయినా అబద్ధాలాడి జట్టులోకి వచ్చినప్పుడు మతం గుర్తుకు రాలేదా? అని నిలదీత
  • ఇతరులను మోసగించడాన్ని మతం నేర్పిస్తుందా? అంటూ సూటిప్రశ్న
  • టీ20 వరల్డ్ కప్ లో పాక్ జట్టు పేలవ ప్రదర్శనపై ‘ఎక్స్’లో సుదీర్ఘ పోస్ట్
  • విఫలమైన ఆటగాళ్లపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

పాకిస్థాన్ క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మొహమ్మద్ రిజ్వాన్ పై ఆ దేశ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహ్ జాద్ మండిపడ్డాడు. ఇటీవలి టీ20 వరల్డ్ కప్ లో పేలవ ప్రదర్శనను సమర్థించుకొనేందుకు రిజ్వాన్ మతం కార్డును ఉపయోగించడాన్ని తప్పుబట్టాడు. ఇస్లాం మతానికి తాను బ్రాండ్ అంబాసిడర్ నంటూ రిజ్వాన్ పేర్కొనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. 

వరల్డ్ కప్ లో పేలవ ఆటతీరును దాచిపెట్టేందుకు కొందరు ఆటగాళ్లు అనవసరంగా విలేకరుల సమావేశాలు నిర్వహిస్తూ మతం కార్డు ఉపయోగిస్తున్నారని పరోక్షంగా రిజ్వాన్ ను ఉద్దేశించి విమర్శించాడు. ఫిట్ నెస్ లేకపోయినా అబద్ధాలు చెప్పి జాతీయ జట్టులో చోటు పొందినప్పుడు వారికి ఇస్లాం మతం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించాడు. ఇతరులను మోసగించడం, మైదానంలో అబద్ధాలాడటాన్ని మతం నేర్పిస్తుందా? అని నిలదీశాడు. 

‘గ్రౌండ్ లో మెరుగ్గా ఆడేందుకు డబ్బు చెల్లిస్తున్నారు. అంతేకానీ అబద్ధాలాడి జట్టులోకి వచ్చేందుకు కాదు. మన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించాలని మతం బోధిస్తుంది. మన బాధల గురించి అబద్ధాలాడమని మతం చెప్పదు. కానీ కొందరు ఆటగాళ్లకు మరో అవకాశం ఇవ్వాలని వారి తరఫున వకాల్తా పుచ్చుకున్న వ్యక్తులు అంటున్నారు. కానీ ఎందుకు ఇవ్వాలి? ఇది పాకిస్థాన్ జట్టు. ఇదేమీ వారి సొంత జట్టు కాదు. వారికి మరో అవకాశం కావాలనుకుంటే వారి సొంత జట్టు ఏర్పాటు చేసుకుని స్నేహితులతో ఆడుకోవచ్చు. కానీ పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఎంతమాత్రం ఆడకూడదు’ అని షెహ జాద్ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశాడు. ప్రపంచ కప్ లో విఫలమైన ఆటగాళ్లపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలు తీసుకోవాలని అతను డిమాండ్ చేశాడు.

టీ20 వరల్డ్ కప్ లో రిజ్వాన్ కేవలం 36.66 సగటు, 90.90 స్ట్రైక్ రేట్ తో 110 పరుగులే చేశాడు. తన ఆటతీరుపై విమర్శలు రావడంతో మంగళవారం తన సొంత పట్టణం పెషావర్ లో విలేకరుల సమావేశం నిర్వహించాడు. వరల్డ్ కప్ లో జట్టు వైఫల్యంపై స్వదేశంలో విమర్శలు వెల్లువెత్తడం సబబే అయినప్పటికీ తాను ఇస్లాంకు బ్రాండ్ అంబాసిడర్ నంటూ చెప్పుకొచ్చాడు.

‘మనిషి రెండు విషయాలకు బ్రాండ్ అంబాసిడర్ అని నేను నమ్ముతా. ఒక వ్యక్తి ముస్లిం అయితే అతను ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఇస్లాం ప్రతినిధిగా ఉంటాడు. ఇక రెండోది.. అతను పాకిస్థాన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటాడు. ఇతరులు అనే మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అంటూ రిజ్వాన్ వ్యాఖ్యానించాడు.

More Telugu News