Govt Documents: విజయవాడ-అవనిగడ్డ కరకట్టపై బస్తాలకొద్దీ గత ప్రభుత్వ ఫైళ్ల దహనం
- ఇన్నోవా కారులో వచ్చి కరకట్టపై తగలబెట్టిన యువకులు
- కాలుష్య నియంత్రణ మండలి, ఖనిజాభివృద్ధి సంస్థకు చెందినవిగా అనుమనం
- ఫైళ్లపై మాజీమంత్రి పెద్దిరెడ్డి, సమీర్‌శర్మ ఫొటోలు
- పరారవుతున్న యువకులను అడ్డుకుని పోలీసులకు అప్పగించిన టీడీపీ నేతలు
విజయవాడ-అవనిగడ్డ కరకట్టపై గతరాత్రి బస్తాలకొద్దీ ఫైళ్లను తగులబెట్టడం కలకలం రేపింది. గత రాత్రి 9 గంటల సమయంలో కొందరు వ్యక్తులు ఇన్నోవా కారులో వచ్చి పెనమలూరు మండలం పెదపులిపాక సమీపంలోని శ్రీనగర్ కాలనీవద్ద కారు ఆపి బస్తాలు దించి కరకట్టపై తగులబెట్టారు.
అదే సమయంలో అటుగా వెళ్తున్న టీడీపీ కార్యకర్త ఒకరు కాలుతున్న పత్రాలపై మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాలుష్య నియంత్రణమండలి మాజీ చైర్మన్ సమీర్‌శర్మ ఫొటోలు ఉండడాన్ని గమనించి వెంటనే పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, టీడీపీ నాయకులకు సమాచారం అందించారు.
వారు ఆలస్యం చేయకుండా కరకట్ట వద్దకు చేరుకున్నారు. టీడీపీ నేతలను గమనించిన యువకులు యనమలకుదురు వైపు పరారయ్యారు. అక్కడ టీడీపీ నేతలు ఆ వాహనాన్ని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి వచ్చి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సమీర్‌శర్మ సూచనతోనే ఫైళ్లు తగలబెట్టినట్టు ఇన్నోవా డ్రైవర్ నాగరాజు తెలిపారు. తగలబడిన ఫైళ్లు కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు చెందినవిగా అనుమానిస్తున్నారు.