Air Pollution Related Deaths: భారత నగరాల్లో స్వల్పకాలిక వాయుకాలుష్యంతో ఏటా 33 వేల మంది బలి

33000 Died Every Year In 10 Indian Cities Due To Rising Pollution Study

  • లాన్సెట్ హెల్త్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనంలో వెల్లడి
  • వాయుకాలుష్య సంబంధిత మరణాల్లో తొలి స్థానంలో ఢిల్లీ 
  • కాలుష్యం కనిష్ఠ స్థాయిలో ఉన్న నగరంగా సిమ్లా
  • వాయు కాలుష్య ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయాలన్న అధ్యయనం

భారత్‌లోని పది ప్రధాన నగరాల్లో స్వల్పకాలిక వాయు కాలుష్యానికి ఏటా సుమారు 33 వేల మంది బలవుతున్నట్టు లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం తేల్చింది. సస్టెయినబుల్ ఫ్యూచర్స్ కొలాబొరేటివ్, అశోకా యూనివర్సిటీ, సెంటర్ ఫర్ క్రానిక్ డిసీజ్ కంట్రోల్, స్వీడెన్‌కు చెందిన కెరలిన్స్కా ఇన్‌స్టిట్యూట్, హార్వర్డ్ యూనివర్సిటీ, బోస్టన్ యూనివర్సిటీలు సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించాయి. 2008-2019 మధ్య కాలంలో పీఎమ్ 2.5 సూక్ష్మ ధూళి కణాల ప్రభావం కారణంగా సంభవించిన మరణాలపై ఈ అధ్యయనం నిర్వహించారు.

ఈ అధ్యయనం ప్రకారం, ఢిల్లీలో అత్యధికంగా ఏటా 12 వేల మంది వాయు కాలుష్యానికి బలయ్యారు. బెంగళూరులో ఏటా 2100 మంది, చెన్నైలో 2900 మంది, కోల్‌కతాలో 4700 మంది, ముంబైలో 5100 మంది ఏటా వాయు కాలుష్యం కారణంగా మరణిస్తున్నారు. సిమ్లాలో వాయుకాలుష్య సంబంధిత మరణాల సంఖ్య దేశంలోనే అత్యల్పంగా ఏటా 59గా ఉన్నట్టు అధ్యయనం తేల్చింది. ధూళికణాల్లో ప్రతి 10 మైక్రోగ్రాముల పెరుగుదలకు మరణాల శాతం 1.17 శాతం పెరుగుతోందని తేలింది. 

భారత్ అనుసరిస్తున్న ప్రమాణాల ప్రకారం ప్రస్తుతం గాల్లో క్యూబిక్ మీటరుకు 60 మైక్రోగ్రాముల సూక్ష్మీధూళి కణాలతో ప్రమాదం ఏమీ ఉండదు. అయితే, ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణమైన క్యూబిక్ మీటరుకు 15 మైక్రోగ్రాముల సంఖ్య కంటే చాలా ఎక్కువని అధ్యయనకారులు తేల్చారు. ప్రభుత్వం ఈ పరిమితిని మరింత తగ్గించి ప్రమాణాలను కఠినతరం చేయాలని సూచించారు. ప్రజలను వాయుకాలుష్యం నుంచి తగ్గించేందుకు ఇది అత్యవసరమని అన్నారు. 

వాయుకాలుష్యం తక్కువగా ఉన్నట్టు భావించే ముంబై, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై నగరాల్లో కూడా మరణాలు అధికంగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. గాల్లో సూక్ష్మ ధూళికణాలు క్యూబిక్ మీటరుకు పది మైక్రోగ్రాములు పెరిగితే మరణాల్లో 1.42 శాతం పెరుగుదల నమోదవుతుందని గత అంచనా కాగా ప్రస్తుత అంచనాలు 3.57 శాతానికి చేరుకున్నాయని తెలిపారు.

  • Loading...

More Telugu News