Jharkhand: ఝార్ఖండ్ ముఖ్యమంత్రి చంపయి సోరెన్ రాజీనామా
- గవర్నర్ రాధాకృష్ణకు రాజీనామాను సమర్పించిన చంపయి
- హేమంత్ సోరెన్‌ను నాయకుడిగా ఎన్నుకున్నామని వెల్లడి
- సీఎంగా రేపు హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి చంపయి సోరెన్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ రాధాకృష్ణకు అందించారు. హేమంత్ సోరెన్, ఇతర నేతలతో కలిసి ఆయన గవర్నర్‌ను కలిశారు. రాజీనామా పత్రాన్ని సమర్పించిన అనంతరం చంపయి సోరెన్ మాట్లాడుతూ... కొన్ని నెలల కిందట సీఎంగా బాధ్యతలు స్వీకరించినట్లు చెప్పారు. హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదల కావడంతో కూటమి ప్రభుత్వం నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. తమ నాయకుడిగా హేమంత్ సోరెన్‌ను ఎన్నుకున్నామని, అందుకే ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేశానన్నారు.
భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ జనవరి 31న అరెస్టయ్యారు. ఆయనను ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో చంపయి సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. హేమంత్ సోరెన్‌కు ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఈ క్రమంలో చంపయి సోరెన్ రాజీనామా చేశారు. అంతకుముందు, జేఎంఎం సారథ్యంలోని కూటమి ఎమ్మెల్యేలు సమావేశమై శాసన సభాపక్ష నగా హేమంత్ సోరెన్‌ను ఎన్నుకున్నారు. ఆయన రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.