KCR: ఎన్నో పరిస్థితుల్ని తట్టుకొని నిలబడ్డాం... ప్రస్తుత పరిస్థితులు లెక్కే కాదు: కేసీఆర్

KCR meeting with Palamuru Medchal Nalgonda district leaders

  • నాడు శక్తిమంతమైన ఆంధ్రా వ్యవస్థలను తట్టుకొని నిలిచామన్న కేసీఆర్
  • చంద్రబాబును ఎదిరించి నిలబడటమంటే ఆషామాషీ వ్యవహారం కాదని వ్యాఖ్య
  • గెలుపోటములకు అతీతంగా తెలంగాణ మనకు అండగా ఉందన్న కేసీఆర్

తెలంగాణ కోసం ఉద్యమం సమయంలో ఎన్నో పరిస్థితులు తట్టుకొని నిలబడ్డామని... ఇప్పటి పరిస్థితులు ఒక లెక్కే కాదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో బుధవారం తనను కలిసేందుకు మహబూబాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాల నుండి వచ్చిన కార్యకర్తలు, నాయకులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ అస్థిత్వమే ప్రమాదంలో పడిన దిక్కుమొక్కు లేని చివరిదశ ఉద్యమకాలం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన, అటు నుంచి పదేళ్ల ప్రగతి పాలన దాకా తాను కష్టాలను ఎదుర్కొన్నానన్నారు. వాటితో పోల్చితే ప్రస్తుత పరిస్థితి పెద్దదేమీ కాదన్నారు.

ఆనాడు తెలంగాణను అష్ట దిగ్బంధనం చేసిన సమైక్యవాద శక్తులు, వారి మీడియాతో సహా సమస్త రంగాలు.. వాళ్లు రాసిందే రాత గీసిందే గీతగా నడిచేదన్నారు. అత్యంత శక్తిమంతమైన ఆంధ్రా వ్యవస్థలను తట్టుకుంటూ.. తెలంగాణ వ్యతిరేకతకు, సమైక్యవాదానికి సింబాలిక్‌గా ఉన్న నాటి పాలకుడు చంద్రబాబును ఎదిరించి నిలవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదన్నారు. అలాంటి సమైక్యవాద కుటిల వ్యవస్థలనే బద్దలుకొట్టి తెలంగాణను సాధించి.. కలబడి నిలబడిన తెలంగాణ సమాజం, భవిష్యత్తులో ఎలాంటి ప్రతిబంధక పరిస్థితులనైనా అధిగమిస్తుందని భరోసా వ్యక్తం చేశారు.

గెలుపోటములకు అతీతంగా తెలంగాణ సమాజం మనకు ఎల్లవేళలా అండగా ఉందని, భవిష్యత్తులోనూ ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నైజం మరోసారి అర్థమైన ప్రజలు, ఓటేసి పొరపాటు చేశామని భావిస్తున్నారన్నారు. కేసీఆర్ మీద ద్వేషంతో, అసంబద్ధ ప్రకటనలతో ప్రజా ఆకాంక్షలకు విరుద్ధంగా నడస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడే రోజులు వస్తాయన్నారు.

బీఆర్ఎస్ విజయప్రస్థానంలో నిన్నటి ఓటమితో దిష్టి తీసినట్లైందన్నారు. రెండు దశాబ్దాల బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగులో అద్భుత విజయాలే దక్కాయన్నారు. గిమ్మిక్కులతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పొరపాటు చేశామని ప్రజలకు అర్థమైందన్నారు. బీఆర్ఎస్‌ను తెలంగాణ సమాజం తిరిగి కోరుకుంటోందన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటామన్నారు.

  • Loading...

More Telugu News