Padi Kaushik Reddy: ప్రజల సమస్యలను జెడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావడం కౌశిక్ రెడ్డి చేసిన తప్పా?: హరీశ్ రావు

Harish Rao fires over criminal case on Koushik Reddy

  • హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదును ఖండించిన హరీశ్ రావు   
  • ప్రజాపాలన అంటే ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు బనాయించడమా? అని ఆగ్రహం
  • కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేతకావడం లేదని విమర్శ

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రజల సమస్యలను జెడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావడం కౌశిక్ రెడ్డి చేసిన తప్పా? అని నిలదీశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రజాపాలన అంటే ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు బనాయించి వారి నోళ్లు మూయించడమేనా? అన్నారు.

కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదన్నారు. ప్రతీకార చర్యలను, అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొంటామన్నారు. ప్రజల తరుపున పోరాటం కొనసాగిస్తామన్నారు.

పరిపాలన చేతకావడం లేదు

కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేతకావడం లేదని హరీశ్ రావు విమర్శించారు. దుబ్బాకలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వం పరిపాలనను గాలికి వదిలేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా అత్యాచారాలు, హత్యలు, ఆత్మహత్యలే అన్నారు. ప్రతిపక్షాలపై కేసులు, కుట్రలు తప్ప పాలన చేతకావడం లేదన్నారు. రాష్ట్రంలో రైతుబంధుకు దిక్కేలేదన్నారు. కేసీఆర్ హయాంలో జూన్ నెలలోనే రైతుబంధు వచ్చేదన్నారు. గీతలు, కోతలు పెడతామనేది ప్రభుత్వం ఆలోచన అన్నారు.

More Telugu News