Taskin Ahmed: నిద్ర పోయాడు.. భారత్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు!
![Taskin Ahmed Apologises to Teammates for Missing Team Bus Due to Oversleeping Ahead IND vs BAN ICC T20 World Cup 2024 Super Eights Clash](https://imgd.ap7am.com/thumbnail/cr-20240703tn6684e021cb909.jpg)
- టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌తో జరిగిన సూపర్-8 మ్యాచ్ ఆడని తస్కిన్ అహ్మద్
- తస్కిన్ కీలక మ్యాచ్‌కు ఎందుకు దూరమయ్యాడన్నది ఆలస్యంగా వెలుగులోకి
- అతిగా నిద్రపోయి.. బస్సు అందుకోలేక మ్యాచ్‌కు దూరమైన వైనం
బంగ్లాదేశ్ వైస్ కెప్టెన్ తస్కిన్ అహ్మద్ విస్మయం గొలిపే కారణంతో టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌తో జరిగిన సూపర్-8 మ్యాచ్ ఆడలేదు. అయితే, తస్కిన్ కీలక మ్యాచ్‌కు దూరం కావడానికి కారణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతి నిద్ర కారణంగా అతడు మ్యాచ్ ఆడలేకపోయాడు. మ్యాచ్ జరిగిన రోజు తస్కిన్ బస్సు వచ్చిన సమయానికి నిద్ర పోతూ ఉన్నాడు. సమయానికి బస్సు అందుకోలేకపోవడంతో అతడు తుది జట్టులో చోటు కోల్పోయాడు. ఆ తర్వాత మరో వాహనంలో స్టేడియానికి వచ్చినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే బంగ్లా జట్టును ప్రకటించారు. దీంతో అతడు మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. ఆయన స్థానంలో మెహదీ హసన్‌ను ఆడించారు. అలాగే ఆ రోజు బంగ్లా జట్టు కేవలం ఇద్దరు పేసర్‌లతోనే బరిలోకి దిగింది.
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. బస్సు అందుకోలేకపోయినందుకు తోటి ఆటగాళ్లతో పాటు అందరికీ తస్కిన్ క్షమాపణలు చెప్పాడు. అతిగా నిద్రపోయి.. సమయానికి బస్సు అందుకోలేకపోవడంతోనే అతడు తుది జట్టులో ఆడలేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధికారి ఒకరు వెల్లడించారు.
"బస్సు అందుకోలేకపోయిన తస్కిన్ ఆ తర్వాత జట్టుతో చేరాడు. కానీ అతను ఎందుకు ఆడలేదో కోచ్ మాత్రమే చెప్పగలడు. ఎందుకంటే అతను ప్లాన్‌లో ఉన్నాడా? లేదా? అనేది ప్రధాన కోచ్ కు (చండికా హతురుసింగ) మాత్రమే తెలుసు. ఏదైనా సమస్య (కోచ్, ప్లేయర్ మధ్య) ఉంటే అతను ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్ ఎలా ఆడాడు. బస్సు అందుకోలేకపోయినందుకు తోటి ఆటగాళ్లతో పాటు అందరికీ తస్కిన్ క్షమాపణలు చెప్పాడు. దీన్నో సమస్యగా చూడాల్సిన అవసరం లేదు" అని బీసీబీ అధికారి అన్నాడు.
ఇక బంగ్లాదేశ్ ఇప్పటివరకు ఏ ఐసీసీ ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్‌కు చేరకుండానే ఇంటిముఖం పట్టింది. ఇప్పుడిప్పుడే క్రికెట్ ఓనమాలు నేర్చుకుంటున్న ఆఫ్ఘనిస్థాన్ ఈసారి ఏకంగా సెమీస్‌కు చేరి అందరీ ప్రశంసలు అందుకుంది. నజ్ముల్ హుస్సేన్ శాంటో నేతృత్వంలోని బంగ్లా జట్టు సూపర్-8లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. దీంతో మరోసారి ప్రపంచ వేదికపై బంగ్లాదేశ్ నిరాశాజనక ప్రదర్శనతో ఇంటిదారి పట్టడాన్ని ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.