BSNL: పెరగనున్న ధరల నుంచి ఉపశమనం కలిగించేలా.. రూ. 249తో బీఎస్‌ఎన్‌ఎల్ సూపర్ ప్లాన్!
![BSNL introduces Rs 249 plan A relief amid rising recharge costs](https://imgd.ap7am.com/thumbnail/cr-20240702tn66839c541c9c8.jpg)
- 45 రోజుల కాలపరిమితితో బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్లాన్
- రోజుకు 2జీబీ డేటా
- ఇండియాలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత కాల్స్
టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఇటీవలే తమ తమ టారిఫ్‌ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు 26 శాతం మేర ఈ పెంపు ఉండనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) తమ వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా ఓ కొత్త ప్లాన్‌తో ముందుకు వచ్చింది. ఈ ప్లాన్ ధర కేవలం రూ. 249 మాత్రమే.
బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 249 ప్లాన్ వివరాలు..
ఈ కొత్త ప్లాన్ 45 రోజుల కాలపరిమితితో వస్తుంది. ఇది సాధారణ ప్లాన్‌ల కంటే చాలా ఎక్కువ.
ఇండియాలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత కాలింగ్ సౌకర్యం ఉంది.
రోజుకు 2జీబీ డేటా వస్తుంది.
రోజూ 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లను వినియోగదారులు వాడుకోవచ్చు.
ఇక ఇదే ధరలో ఎయిర్‌టెల్ కూడా తమ కస్టమర్లకు ఒక ప్లాన్‌ను అందిస్తోంది. అయితే, ఇది కేవలం 28 రోజులు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అలాగే రోజుకు కేవలం 1జీబీ డేటా మాత్రమే వస్తుంది. అదే బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న రూ. 249 ప్లాన్ కాలపరిమితి 45 రోజులు. అలాగే రోజూ 2జీబీ డేటాను వినియోగదారులు పొందవచ్చు. అంటే.. కొత్త బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్ వినియోగదారుకు 17 అదనపు రోజుల సర్వీస్‌ను అందించడమే కాకుండా, అదే ధరలో లభించే ఎయిర్‌టెల్ ప్లాన్‌తో పోల్చితే రోజువారీ డేటా కూడా రెట్టింపు వస్తుంది. దీంతో అధిక టారీఫ్‌ల నుంచి ఉపశమనాన్ని కోరుకునే మొబైల్ యూజర్లను ఆకట్టుకునేందుకే బీఎస్‌ఎన్‌ఎల్ తక్కువ ధరకే ఎక్కువ ప్రయోజనాలున్న ఈ ప్లాన్‌ను తీసుకొచ్చిందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ఇక జియో, ఎయిర్‌టెల్ తమ ధరల పెరుగుదల బుధవారం (జులై 3) నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించాయి. అలాగే వొడాఫోన్ ఐడియా తమ కొత్త ధరలు గురువారం (జులై 4) నుంచి అమలులోకి వస్తాయని తెలిపాయి. దీంతో ఒక్కో వినియోగదారునిపై గరిష్ఠంగా రూ.600 భారం పడనుంది.