BRS: కాంగ్రెస్ నాయకుల అరాచకానికి ఖమ్మం రైతు బలి.. వీడియో షేర్ చేస్తూ ఆరోపించిన బీఆర్ఎస్

Farmer Suicide Video Shared By BRS Party

  • గ్రామాల్లో కాంగ్రెస్ నేతల అరాచకాలు మితిమీరుతున్నాయంటూ ట్వీట్
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనుచరుల నిర్వాకమేనని మండిపాటు
  • కన్నీరు పెట్టిస్తున్న రైతు సూసైడ్ వీడియో

గ్రామాల్లో కాంగ్రెస్ నాయకుల అరాచకాలు మితిమీరుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఖమ్మం జిల్లా పొద్దుటూరులో రైతు బోజడ్ల ప్రభాకర్ ఆత్మహత్యకు కారణం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అనుచరులేనని ఆరోపించింది. భూమిని స్థానిక కాంగ్రెస్ నాయకులు కబ్జా చేయడం, అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ప్రభాకర్ బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలిపింది. రైతు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించి రైతు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. 

ఏం జరిగిందంటే..
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరులో బోజడ్ల ప్రభాకర్ అనే రైతుకు ఏడెకరాల భూమి ఉంది. ఇందులో 3 ఎకరాల 10 గుంటల పొలాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆక్రమించారు. సర్వే నెంబర్ 276, 277 లో ఉన్న తన పొలాన్ని ట్రాక్టర్లు, జేసీబీలు, బుల్డోజర్లతో ధ్వంసం చేశారని ప్రభాకర్ సూసైడ్ వీడియోలో చెప్పాడు. గ్రామానికి చెందిన కూరపాటి కిషోర్, పెండ్యాల రామారావు, గుర్రం నాగమల్లేశ్వరరావు, మంగలి శ్రీను, ముత్తయ్యలు తన పొలాన్ని ఆక్రమించారని ఆరోపించాడు.

దీనిపై చింతకాని ఎమ్మార్వో, ఎస్సైలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయాడు. కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేయడానికి వెళితే టైమ్ అయిపోయిందని అధికారులు వెనక్కి పంపారని ప్రభాకర్ కన్నీటి పర్యంతమయ్యాడు. మరో మార్గం లేక పురుగుల మందు తాగుతున్నానని, తాను ఉన్నా లేకున్నా తన కుటుంబానికి న్యాయం చేయాలని వీడియోలో అర్థించాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తనకు న్యాయం చేయాలని కోరాడు. ఆపై పురుగుమందు తాగి ప్రభాకర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

More Telugu News