Reliance Jio: రేపటి నుంచి జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఈ ట్రిక్‌తో కొన్ని నెలలపాటు ధరల భారం నుంచి తప్పించుకోవచ్చు!

Airtel and Jio users can use this trick to avoid tariff hike

  • ప్రస్తుత ప్లాన్ యాక్టివేట్‌లో ఉన్నా రీచార్జ్ చేసుకునే వెసులుబాటు
  • నేటి అర్ధ రాత్రి 12 గంటల లోపు చేసుకుంటేనే ఫలితం
  • జియో, భారతి ఎయిర్‌టెల్ యూజర్లకు మాత్రమే 
  • జియో యూజర్లు ఒకేసారి 50 రీచార్జ్‌లు చేసుకోవచ్చు
  • పోస్టు పెయిడ్ యూజర్లు మాత్రం పెరిగిన భారం భరించాల్సిందే

దేశంలోని దిగ్గజ టెల్కోలు రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ పెంచిన రీచార్జ్ ధరలు రేపటి (3వ తేదీ) నుంచి అందుబాటులోకి రానున్నాయి. జియో తన టారిఫ్ ధరలను 12 నుంచి 25 శాతం వరకు పెంచగా, ఎయిర్‌టెల్ 11 నుంచి 21 శాతం ధరలు పెంచాయి. అయితే, ఒక చిన్న ట్రిక్‌తో పెరిగిన ధరల భారం నుంచి ఈసారికి తప్పించుకోవచ్చు. జియోలో పాప్యులర్ అయిన రూ. 239 ప్లాన్ ధర రేపటి నుంచి రూ. 299 కానుంది. అంటే 25 శాతం ధర పెరిగిందన్నమాట. అదే ఏడాది ప్లాన్ అయితే ఈ రెండు కంపెనీలు ఏకంగా రూ. 600 వరకు పెంచేశాయి. అయితే, ఈసారి పెరిగిన ధరల భారం నుంచి తప్పించుకోవాలంటే ఈ చిన్న ట్రిక్ ఉపయోగిస్తే చాలు.

ఇప్పటికే ఉపయోగిస్తున్న మీ ప్లాన్ యాక్టివ్‌గా ఉన్నా సరే నేటి రాత్రి 12 గంటల లోపు ఎప్పుడైనా రీచార్జ్ చేసుకోవడం ద్వారా పెరిగిన భారం నుంచి బయటపడొచ్చు. జియో, ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్లకు ముందుగానే రీచార్జ్ చేసుకొనే వెసులుబాటు ఉంది. మిగతా వారికి ఈ అవకాశం లేదన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి.

జియో సబ్‌స్క్రైబర్లు ఏ ప్లాన్‌తో అయినా రీచార్జ్ చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ ఖాతాదారులు మాత్రం ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ప్లాన్‌తోనే రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత ప్లాన్ గడువు ముగిసిన వెంటనే కొత్త ప్లాన్ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. ప్రస్తుతం యాక్టివేట్‌లో ఉన్న ప్లాన్ కాకుండా కొత్త ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే మాత్రం వెంటనే అది యాక్టివేట్ అయిపోతుంది. వొడాఫోన్ ఐడియా యూజర్లు మాత్రం ఇలా ముందుగా రీచార్జ్ చేసుకోలేరు. కాబట్టి వారు పెరిగిన ధరలు భరించాల్సి ఉంటుంది.

ఇక్కడ మరో విషయాన్ని కూడా యూజర్లు తెలుసుకోవాల్సి ఉంటుంది. జియో యూజర్లు 50 రీచార్జ్‌ల వరకు ముందుగానే చేసుకోవచ్చు. అవి నెలవారీ అయినా, ఏడాది ప్లాన్లు అయినా. కాబట్టి వారు అవసరాన్ని బట్టి పలు రీచార్జ్‌లు చేసుకోవడం ద్వారా కొన్ని నెలలపాటు పెరిగిన ధరల భారాన్ని తగ్గంచుకోవచ్చు. అయితే, ఎయిర్‌టెల్‌లో ఇలా ఒకేసారి పలు రీచార్జ్‌లు చేసుకొనే వెసులుబాటు ఉన్నదీ, లేనిదీ ఆ సంస్థ వెల్లడించలేదు. పోస్టు పెయిడ్ యూజర్లు మాత్రం ఇలా పెరిగిన ధరల భారం నుంచి తప్పించుకునే మార్గం లేదు.

  • Loading...

More Telugu News