Vijay Mallya: విజయ్ మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

A special court in Mumbai issued a non bailable warrant against Vijay Mallya in a Rs180 crore loan default case linked to IOB

  • రూ.180 కోట్ల రుణం ఎగవేత కేసులో ముంబై ప్రత్యేక కోర్టు ఆదేశాలు
  • సీబీఐ సమర్పించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకొని జారీ
  • ఉద్దేశపూర్వకంగానే రుణ ఎగవేతకు పాల్పడ్డారంటున్న సీబీఐ

పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాపై ముంబై ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్  జారీ చేసింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కి సంబంధించిన రూ.180 కోట్ల రుణం ఎగవేత కేసులో సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి నాయక్ నింబాల్కర్ జూన్ 29న ఈ వారెంట్ జారీ చేశారు. రుణం ఎగవేత కేసులో సీబీఐ సమర్పించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకున్నామని, అదేవిధంగా అతడి స్టేటస్ ‘పరారీలో ఉన్న వ్యక్తి’ కావడంతో ఈ నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు.

కాగా ఈ కేసుపై సీబీఐ విచారణ జరుపుతోంది. ప్రస్తుతం మూతపడిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కంపెనీ ప్రమోటర్ ఉద్దేశపూర్వకంగానే రుణాన్ని ఎగవేసిందని, ప్రభుత్వ అధీనంలోని బ్యాంకుకు ఏకంగా రూ.180 కోట్లకు పైగా మొత్తాన్ని చెల్లించకుండా నష్టాన్ని కలిగించారని సీబీఐ చెబుతోంది. 

కాగా 2007 నుంచి 2012 మధ్య కాలంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాలు పొందింది. కానీ తిరిగి చెల్లించలేదు. దీంతో సీబీఐ మోసం కేసు నమోదు చేసింది. మనీల్యాండరింగ్ కేసుల్లో విజయ్ మాల్యా పరారీలో ఉన్నాడంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రకటించిన విషయం తెలిసిందే. విజయ్ మాల్యా ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నాడు.

More Telugu News