Team India: బార్బడోస్‌లో ఇంకా మెరుగుపడని వాతావరణం.. అక్కడే వేచిచూస్తున్న భారత క్రికెట్ జట్టు
- హరికేన్ బెరిల్ ఎఫెక్ట్‌తో ఇంకా మెరుగుపడని వాతావరణం.. మూసివున్న ఎయిర్‌పోర్టు
- సోమవారం కూడా ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాల బంద్
- మంగళవారం మధ్యాహ్నానికి వాతావరణం మెరుగుపడే అవకాశం
- తీవ్ర ఈదురు గాలుల ప్రభావంతో విమానాలు నడపలేని పరిస్థితి
టీ20 వరల్డ్ కప్ 2024ను గెలిచిన భారత్ జట్టు స్వదేశానికి బయలుదేరడానికి వాతావరణం ఇంకా అనుకూలించడం లేదు. టీమిండియా ఆటగాళ్లు బస చేస్తున్న బార్బడోస్‌లో ‘హరికేన్ బెరిల్’ ప్రభావంతో తీవ్రమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో బ్రిడ్జిటౌన్ ఎయిర్‌పోర్ట్‌లో కార్యకలాపాలను నిలిపివేశారు. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. సోమవారం సాయంత్రం బయలుదేరాలని భావించినప్పటికీ సాధ్యపడలేదు. దీంతో భారత జట్టు రాక మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.
నిజానికి బార్బడోస్ నుంచి న్యూయార్క్ వెళ్లి అక్కడి నుంచి ముంబై రావాలని ప్రయత్నించారు. ఆ తర్వాత సోమవారం సాయంత్రం చార్టెర్డ్ విమానం ద్వారా నేరుగా ఢిల్లీ రావాలని భావించారు. కానీ వాతావరణం మెరుగవ్వకపోవడంతో ఆటగాళ్లు అక్కడే ఉండిపోవాల్సి వస్తోంది. అయితే హరికేన్ బెరిల్ సోమవారం తెల్లవారుజామున కరీబియన్ దీవులను తాకింది. దీంతో మంగళవారం మధ్యాహ్నానికి వాతావరణం సానుకూలంగా ఉండొచ్చని తెలుస్తోంది. ఈదురు గాలుల ప్రభావం తగ్గగానే బ్రిడ్జిటౌన్ ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలు పున:ప్రారంభమవనున్నాయి.
కాగా భారత ఆటగాళ్ల ప్రయాణాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ముందుగా ఆటగాళ్లతో పాటు ప్రతి ఒక్కరినీ సురక్షితంగా ఇక్కడి నుంచి స్వదేశానికి తీసుకెళ్లడం ముఖ్యమని, ఆ తర్వాత సన్మానం గురించి ఆలోచిస్తామని జైషా ఓ జాతీయ మీడియా సంస్థతో అన్నారు. తాను కూడా బార్బడోస్‌లో ఉన్నానని, చార్టర్ ఫ్లైట్ ద్వారా సోమవారం బయలుదేరాలని భావించినప్పటికీ విమానాశ్రయం మూసివేసి ఉందని ఆయన చెప్పారు.
పలు చార్టర్ ఫ్లైట్ల ఆపరేటర్‌లతో టచ్‌లో ఉన్నామని, కానీ విమానాశ్రయంలో కార్యకలాపాల పున:ప్రారంభంపైనే అంతా ఆధారపడి ఉంటుందని జైషా పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విమానం ల్యాండ్ లేదా టేకాఫ్ అయ్యే పరిస్థితి లేదన్నారు. నేరుగా భారత్ చేరుకోవాలని భావిస్తున్నామని, అమెరికా లేదా యూరప్‌లో ఇంధనం నింపుకునే స్టాప్ ఉంటుందని జైషా పేర్కొన్నారు. ఈ మేరకు విమానాశ్రయ అధికారులతో టచ్‌లో ఉన్నామని, మంగళవారం మధ్యాహ్నం తర్వాత విమానాశ్రయం తిరిగి తెరచుకునే అవకాశం ఉందని, ముందుగానే వాతావరణం మెరుగుపడితే బయలుదేరి వచ్చేస్తామని జైషా ఓ జాతీయ మీడియా సంస్థకు వివరించారు.